
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ బీజేపీ ఎంపీలు సుధాంశు త్రివేది, పర్వేశ్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్నవారి గురించి తాము చేసిన ఆరోపణలు విని.. ఎమ్మెల్సీ కవిత ఎందుకంత భయపడిపోతున్నారో అర్ధం కావడం లేదన్నారు. భయపడకపోతే బండి సంజయ్ ను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై ఆధారాలు ఉన్నాయా ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎంపీ పర్వేశ్ బదులిస్తూ.. ‘‘కవితను ఉద్దేశించి నేను చేసిన ఆరోపణలపై సీబీఐ ఎంక్వయిరీ చేస్తుంది. ఎంక్వయిరీ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరున్నారు అనే నిజానిజాలు బయటికి వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా.. అవినీతి చేయడం వాళ్లకు కొత్తేమీ కాదు. సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారన్న కవిత , ప్రతిపక్షాల వ్యాఖ్యలు కూడా కొత్తేం కాదు. ఢిల్లీ కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, బొగ్గు కుంభకోణంలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు లేరా? ’’ అని ఎంపీలు సుధాంశు, పర్వేశ్ కామెంట్స్ చేశారు.
మాగుంట అగ్రోఫామ్స్ కూడా..
తెలుగు రాష్ట్రాలకు చెందిన మాగుంట అగ్రోఫామ్స్ కంపెనీకి కూడా ఢిల్లీ లిక్కర్ బిడ్డింగ్ లో టెండర్ దక్కిందనే విషయాన్ని ఎంపీ సుధాంశు ఈసందర్భంగా గుర్తుచేశారు. హోల్ సేల్ (ఎల్ 1) మద్యం వ్యాపారులకు ఇచ్చే కమిషన్ ను 2 శాతం నుంచి 12 శాతానికి ఎందుకు పెంచారో చెప్పాలని కేజ్రీవాల్ సర్కారును ప్రశ్నించారు. కర్ణాటకలో హోల్ సేల్ లిక్కర్ వ్యాపారం కేవలం రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మాత్రమే చేస్తోంది. దానివల్ల రాష్ట్ర సర్కారు మంచి ఆదాయం లభిస్తోంది. ఇదే తరహా విధానాన్ని ఢిల్లీలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మూడు రిటైల్ జోన్ల (జోన్ 4, 23, 22) లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఒకే కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు.
ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన కేంద్రం
ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ అధికారులను కేంద్రం సస్పెండ్ చేసింది . ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు ఎ.గోపీకృష్ణ, ఆనంద్ కుమార్ తివారీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ గా ఆనంద్ కుమార్ పనిచేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ ఐఆర్ లో ఇద్దరు అధికారుల పేర్లు ఉన్నాయి. దీంతో వారిని విధుల నుంచి తప్పించినట్లు తెలిపారు అధికారులు.
కవితపై ఇటీవల ఎంపీ పర్వేశ్ చేసిన వ్యాఖ్యలివి..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం వెనక తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఇటీవల ఆరోపించారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనీశ్ సిసోడియాతో కేసీఆర్ కుటుంబసభ్యులు భేటీ అయ్యారని, అక్కడే వారికి డీల్ కుదిరిందని తెలిపారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో ఆరు నెలల పాటు సూట్ రూం బుక్ అయి ఉందని ఆయన తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్, లిక్కర్ మాఫియాకు చెందిన వ్యక్తులు, ఎక్సైజ్ అధికారులు హోటల్ రూంలో భేటీ అయి డీల్ గురించి చర్చలు జరిపారని ఆరోపించారు. ‘‘తెలంగాణలో లిక్కర్ మాఫియాకు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ప్రైవేటు విమానంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ వచ్చేవారు. ఒబెరాయ్ హోటల్లో సూట్ రూం బుక్ చేసింది కూడా ఈ లిక్కర్ మాఫియా వ్యక్తే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో కలిసి ఆయనే ఈ పాలసీని రూపొందించారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఇదే లిక్కర్ పాలసీ అమలవుతోంది” అని వర్మ ఇటీవల చెప్పారు.
రూ. 150 కోట్లు ముట్టజెప్పిన్రు..
కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎల్1 లైసెన్స్ హోల్డర్లు, తమ వ్యక్తులను ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్నారని పర్వేశ్ వర్మ ఆరోపించారు. డీల్‌లో ఫస్ట్ ఇన్ స్టాల్మెంట్ కింద సిసోడియాకు రూ. 150 కోట్లు ఇచ్చారని, తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ సొమ్మును ముట్టజెప్పారని తెలిపారు. ‘‘ఎల్1 కమీషన్ ముందుగా మేము తీసుకుంటాం. లాభాలూ తీసుకుంటాం. ఆ తర్వాతే మీరు తీసుకోవాలి’’ అని సిసోడియా డీల్ కుదుర్చుకున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారా? లేదా? ఒబేరాయ్ హోటల్ లో వారిని కలిశారా లేదా? అనే ప్రశ్నలకు సిసోడియా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సిసోడియా కోర్టు ముందు నిజాలు ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.