ఫ్లైఓవరైపై రీల్స్.. రూ.36వేల ఫైన్

ఫ్లైఓవరైపై రీల్స్.. రూ.36వేల ఫైన్

సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేయడం కోసం ఎంతకు తెగిస్తున్నారో వారికే తెలియడం లేదు.  ఆకతాయిలు చేసిన పనికి పోలీసులే బాధితులుగా మారాల్సిన దుస్థితి నెలకొంటుంది. తాజాగా  ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఫ్లై ఓవర్ పై కారు ఆపి రీల్స్ చేయడమే కాకుండా.. అడ్డుకున్న పోలీసులపై ఇద్దరు వ్యక్తులు చేయి చేసుకున్నారు. అనంతరం బ్యా రికేడ్లకు నిప్పంటించారు. ఘటన మొత్తాన్ని షూట్ చేసి ఇన్స్టాలోనూ పోస్ట్ చేశారు. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్లోని ఓ ఫ్లైఓవర్ పై  ఈ ఘటన జరిగింది. 

దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్లాస్టిక్ తో తయారు చేసిన కొన్ని ఫేక్ ఆయుధాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రదీప్ ఢాకా, అతడి స్నేహితుడిగా గుర్తించారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు రూ.36,000 ఫైన్ వేశారు. 

ప్రదీప్, అతడి స్నేహితు డు ఫ్లైఓవర్ పై కారులో ప్రయాణిస్తూ.. మధ్యలో ఒకచోట ఆపి రీల్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంతటితో ఆగకుండా కారు డోర్ తెరిచి ప్రయాణించారు. దీంతో వారిని అడ్డుకున్నాం అని పోలీసులు తెలిపారు. కారు ప్రదీప్‌ తల్లి పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు గుర్తించారు. గతంలోనూ అతడు దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది.