ఢిల్లీకి నీళ్లిచ్చేదాకా నిరాహార దీక్ష: మంత్రి ఆతిషీ

ఢిల్లీకి నీళ్లిచ్చేదాకా నిరాహార దీక్ష: మంత్రి ఆతిషీ

న్యూఢిల్లీ: హత్నీకుండ్ బ్యారేజీ గేట్లన్నీ హర్యానా రాష్ట్ర సర్కారు మూసేయడంతో ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా రావట్లేదని ఢిల్లీ మంత్రి ఆతిశీ మండిపడ్డారు. తమకు రావాల్సిన వాటా నీళ్లు రిలీజ్ చేసేదాకా నిరాహారదీక్షను విరమించేదిలేదని ఆమె స్పష్టం చేశారు. యమునా నదిపై బ్యారేజీ గేట్లను మూసివేయడంతో ఢిల్లీ ప్రజలకు నీళ్లు లేకుండాపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి కొరతతో నానాకష్టాలు పడుతున్న ఢిల్లీకి నీటి వాటా విడుదల చేయాలని కోరుతూ ఆమె చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం మూడోరోజుకు చేరుకోగా, ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘వాటా కింద హర్యానా రాష్ట్రం 613 మిలియన్ గ్యాలన్ల నీళ్లను ఢిల్లీకి రిలీజ్ చేయాల్సి ఉంది. 

గత మూడు వారాలుగా ఈ వాటా శాతాన్ని తగ్గించి 513 మిలియన్ గ్యాలన్లు మాత్రమే విడుదల చేస్తోంది. దీంతో 28 లక్షల మంది ఢిల్లీవాసులకు నీళ్లు అందట్లేదు. శనివారం కొంతమంది జర్నలిస్టులు హథ్నీకుండ్ బ్యారేజీ దగ్గరికి వెళ్లి నీళ్లున్నట్లు టీవీల్లో చూపించారు. హర్యానా సర్కారు మాత్రం మాకే నీళ్లు లేవంటూ అబద్ధాలు చెప్తోంది. ఢిల్లీకి విడుదల చేసే గేట్​ను మూసేసి మిగతావన్నీ ఓపెన్ చేస్తున్నారు. మా వాటా నీళ్లు రిలీజ్ చేసేదాకా నేను నిరాహార దీక్ష విరమించబోను” అని ఆతిశీ వీడియో మెసేజ్​లో పేర్కొన్నారు. కాగా, షుగర్, బీపీ తదితర హెల్త్ కారణాల దృష్ట్యా ఆతిశీ దీక్షను విరమించాలని డాక్టర్లు సూచించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది.