వరద గుప్పిట్లోనే ఢిల్లీ.. నీట మునిగిన రిలీఫ్ క్యాంపులు

వరద గుప్పిట్లోనే ఢిల్లీ.. నీట మునిగిన రిలీఫ్ క్యాంపులు

న్యూఢిల్లీ:  ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు ఇంకా వరదలోనే చిక్కుకుని ఉన్నాయి. బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులు కూడా మునిగిపోయాయి. దీంతో వారిని వేరే షెల్టర్స్​కు తరలిస్తున్నారు. రిలీఫ్ క్యాంపుల్లో తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వరద బాధితులు చెబుతున్నారు. టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. ఆదివారం ఉదయానికి యమునా నది నీటి మట్టం 205.98 మీటర్లకు తగ్గినా.. ఇంకా వరద ముప్పు పొంచి ఉందని సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీలోని చాలా వీధుల్లో నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఓల్డ్ ఢిల్లీలోని యమునా బజార్ ఏరియాలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులన్నీ నీట మునగడంతో వరద బాధితులను అక్కడి నుంచి సేఫ్ ప్లేస్​కు తరలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2,700 టెంట్లలో 27వేల మంది ఉంటున్నట్లు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపింది.

రిలీఫ్ క్యాంపుల్లో సౌలత్​లు కరువు

ఒకపూట కడుపు నింపుకోవడానికి గంటల తరబడి లైన్​లో నిల్చోవాల్సి వస్తున్నదని, రిలీఫ్ క్యాంపులన్నీ దారుణంగా ఉన్నాయని వరద బాధితులు చెబుతున్నారు. అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రిలీఫ్ క్యాంప్ లు కేవలం కూర్చోవడానికి ఉపయోగపడుతున్నాయని, అధికారులు భోజనం పెట్టడంలేదని, తమవెంట తెచ్చుకున్న వస్తువులతో వండుకుని తింటున్నామని బాధితుడు ఒకాయన చెప్పాడు. ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తదో కూడా అధికారులు చెప్పడంలేదని కాళిందికుంజ్ రిలీఫ్ క్యాంప్​లో తలదాచుకుంటున్న ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తిండి, నీళ్లు లేవని, ప్రాణాలు రక్షించుకోవడానికి ఇక్కడికొచ్చామని తెలిపింది.

వరదలకు కారణం ఇదే..

ఢిల్లీ టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేదని, అందుకే వరదలో చిక్కుకుందని ఢిల్లీ డెవలప్​మెంట్ అథారిటీ(డీడీఏ) మాజీ కమిషనర్ ఏకే జైన్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 1962లో రూపొందించిన ఢిల్లీ ఫస్ట్ మాస్టర్ ప్లాన్​లో చాలా లోపాలున్నాయన్నారు. డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేదని, 1970 కాలంలో జనాభా 30 నుంచి 35లక్షలుంటే.. ఇప్పుడు 2కోట్లకు చేరుకుందన్నారు. జనాభాకనుగుణంగా సౌలత్​లు లేవన్నారు.

ALSO READ :యువతిపై గ్యాంగ్ రేప్..బాధితురాలి చెల్లెలిపైనా లైంగిక దాడి

పాల పాకెట్, కవర్ ఇచ్చి వెళ్లిపోయారు: సీమ, బాధితురాలు

వరద గురించి తమను ఎవరూ అలర్ట్ చేయలేదని మయూర్ విహార్, పాత యమునా బ్రిడ్జ్ ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. వర్షంలో టార్పాలిన్ కవర్ కప్పుకుని పడుకోవాల్సి వచ్చిందని, అధికారులు ఎవరూ సాయం చేయలేదని విమర్శించారు. తన 20ఏండ్ల శ్రమ మూడు రోజుల్లో ఇంటి రూపంలో కొట్టుకుపోయిందని 39 ఏండ్ల సీమ తెలిపింది. అధికారులు వచ్చి టార్పాలిన్ కవర్లు, పాల పాకెట్ ఇచ్చి వెళ్లిపోయారని, తర్వాత పట్టించుకోలేదన్నారు. గతంలో  పోలీసులు అలర్ట్ చేసేవాళ్లని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనలకు, ఇక్కడి పరిస్థితికి పొంతన లేదని తెలిపింది.

ఇంకా ముప్పు పొంచి ఉంది: కేజ్రీవాల్

యమునా నది నీటిమట్టం మెల్లిగా తగ్గుతున్నదని, కొన్ని రోజుల్లో నార్మల్ పరిస్థితికి వస్తుందని సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఒకవేళ మళ్లీ వర్షాలు పడితే మాత్రం వరద ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరించారు. నార్త్ ఢిల్లీలోని మోరి గేట్ రిలీఫ్ క్యాంప్​ను కేజ్రీవాల్ పరిశీలించారు. హత్నికుండ్ డ్యామ్ నుంచి భారీగా వరద నీరు రిలీజ్ చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లు వరదకు కొట్టుకుపోయిన వారి కోసం స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు.