
న్యూఢిల్లీ: ఇండియా,- పాక్ ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ ఎమర్జెన్సీ పరిస్థితులకు సిద్ధమైంది. నగర వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పౌరులను అలర్ట్ చేసేందుకు భద్రతా దళాలు ఢిల్లీలో సైరన్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం రక్షణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు సైరన్ టెస్ట్ నిర్వహించారు. ఐటీఓలోని పీడబ్ల్యూడీ (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్) బిల్డింగ్‌పై సైరన్‌ను ఇన్స్టాల్ చేసి పరీక్షించారు.
మధ్యాహ్నం 3 గంటలకు సైరన్‌ను 15 నుంచి 20 నిమిషాల పాటు మోగించారు. పాకిస్తాన్ మిసైల్స్, బాంబులు ప్రయోగించే అవకాశం ఉన్నందున ఢిల్లీ వ్యాప్తంగా సైరన్లు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సైరన్లను మోగిస్తారు. ఆ సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనే ఉద్దేశంతో సైరన్ మోగిస్తారు. సైరన్ల ఏర్పాటును ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ సమీక్షించారు. సైరన్ పరీక్షిస్తున్నప్పుడు ప్రజలు ఆందోళన చెందొద్దని ముందుగానే సందేశం పంపారు.
ఢిల్లీలోని ఎత్తైన భవనాలపై సైరన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్క సైరన్ సుమారు 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని తెలిపారు. శుక్రవారం రాత్రి 40 నుంచి 50 సైరన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సైరన్ మోగిస్తామని, వెంటనే ప్రజలు ఇండ్లలోకి, సురక్షిత ప్రాంతాల్లో వెళ్లి తల దాచుకోవాలని ఆఫీసర్లు సూచించారు.
చండీగఢ్‌లో మోగిన సైరన్
భారత్, పాక్మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం చండీగఢ్‌లో సైరన్లు మోగాయి. పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడవచ్చనే భారత వైమానిక దళం హెచ్చరికతో అధికారులు సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అందరూ ఇండ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, ఓ గంట తర్వాత హెచ్చరిక సైరన్ ముగిసిందని తెలిపారు. అలాగే, పొరుగున ఉన్న పంచకుల జిల్లా అధికారులు, పంజాబ్‌లోని మొహాలి జిల్లా అధికారులు సైతం సైరన్ మోగించి ప్రజలను అలర్ట్ చేశారు.
అలాగే, పాటియాలా జిల్లా యంత్రాంగం కూడా.. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. అలాగే, ఆయా జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బాల్కనీలు, పైకప్పులు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.