పీకలదాకా మద్యం తాగొచ్చి..రెజ్లర్లను దుర్భషలాడారు

పీకలదాకా మద్యం తాగొచ్చి..రెజ్లర్లను దుర్భషలాడారు

ఢిల్లీలోని జంతర్ మంతర్లో  శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. పీకలదాకా మద్యం తాగొచ్చి..రెజ్లర్లను దుర్భషలాడారు. ఢిల్లీ పోలీసుల అసభ్య ప్రవర్తనపై మహిళా రెజ్లర్లు మండిపడుతున్నారు. 

జంతర్‌మంతర్‌ దగ్గర నిరసన తెలుపుతున్న రెజ్లర్ల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి ఏప్రిల్ 03వ తేదీ బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే రెజ్లర్లకు ఈ మంచాలను ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. అయినా కూడా సోమనాథ్ భారతీ సిబ్బంది ట్రక్కు నుంచి మంచాలు, పరుపులను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెజ్లర్లు, ఎమ్మెల్యే అనుచరులు.... పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న పోలీసు ధర్మేంద్ర రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడారు. ఈ ఘర్షణలో రెజ్లర్లు బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగట్ తోపాటు పలువురికి గాయాలయ్యాయి.
 
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ పై నిరసన వ్యక్తం చేస్తున్న తమపై మద్యం తాగిన ఢిల్లీ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో పాటు  వినేష్ ఫోగట్ ఆరోపించారు. ఇలాంటి రోజులు చూడటానికేనా....తాము ప్రపంచ వేదికలపై పతకాలు సాధించింది అంటూ వినేశ్‌ ఫొగట్‌ కన్నీరు పెట్టుకుంది. తాము నేరస్తులమా అని ప్రశ్నించింది.  ఘటనా స్థలంలో మహిళా పోలీసులు ఎందుకులేరని నిలదీసింది. తమను చంపాలనుకుంటే చంపేయండి అంటూ  వినేష్ ఫోగట్ కన్నీటిపర్యంతమైంది. 

వాన వల్ల  పరుపులు తడిసిపోయాయి.  దీంతో మేం పడుకోవడానికి  ఫోల్డింగ్ మంచాలు తీసుకువస్తున్నాం. దీనికి పోలీసులు అనుమతించలేదు.  మద్యం మత్తులో ఉన్న పోలీసు ధర్మేంద్ర రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను దుర్భాషలాడి.. గొడవకు దిగాడు  అని మాజీ రెజ్లర్ రాజ్‌వీర్ చెప్పారు.

ఢిల్లీ పోలీసుల ప్రవర్తనపై రెజ్లర్ భజరంగ్ పూనియా తీవ్రంగా మండిపడ్డాడు. రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తాను గెలుచుకున్ననాలుగు పతకాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. దేశానికి పతకాలు అందించిన రెజ్లర్లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు తమను వేధిస్తున్నారని...తమకు మద్దతు తెలిపేందుకు దేశం మొత్తం ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చాడు.