ఆ పార్టీ మీకేమిచ్చింది?

ఆ పార్టీ మీకేమిచ్చింది?
  • గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు అర్వింద్​ కేజ్రీవాల్ పిలుపు

రాజ్ కోట్: బీజేపీలోనే ఉంటూ ఆప్ కోసం పని చేయాలని గుజరాత్​లోని బీజేపీ కార్యకర్తలకు ఆప్ చీఫ్​ కన్వీనర్​ అర్వింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. రెండ్రోజుల పర్యటన కోసం గుజరాత్​ వెళ్లిన ఆయన.. శనివారం రాజ్ కోట్​లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇన్నేండ్లుగా పార్టీకి సేవచేస్తున్న మీకు బీజేపీ ఏమిచ్చింది? నాణ్యమైన విద్య, వైద్యం, ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు” అని బీజేపీ కార్యకర్తలను కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఆప్ అధికారంలోకి వస్తే అవన్నీ ఇస్తుందని చెప్పారు. ‘‘మీరు బీజేపీలోనే ఉండండి. కానీ ఆప్ కోసం పని చేయండి. మీలో చాలా మందికి బీజేపీ డబ్బులు చెల్లిస్తుంది. అవి తీసుకోండి.. కానీ మాకోసం వర్క్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఇచ్చేందుకు మా దగ్గర లేవు” అని అన్నారు. కాగా, డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారం ముమ్మరం చేశారు. 

బెదిరింపులకు భయపడం... 

బీజేపీ నిరాశలో ఉందని, ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇటీవల ఆప్ జనరల్ సెక్రటరీ మనోజ్ సొరాథియాపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఈ కామెంట్లు చేశారు. ఆప్ కు మద్దతిచ్చే గుజరాత్ ప్రజలపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రజలు ప్రతి దాడులు చేయొద్దని, ఓపికతో ఉండి తమ కోపాన్ని ఓటు రూపంలో చూపాలని పిలుపునిచ్చారు.

‘‘మీరు (బీజేపీ) ఇప్పటి వరకు కాంగ్రెస్​తో డీల్ చేశారు. కానీ మేం కాంగ్రెస్ లెక్క కాదు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడబోం. మేం సర్దార్ పటేల్, భగత్ సింగ్ లను ఆదర్శంగా తీసుకుంటాం. అన్యాయం, అవినీతిపై పోరాడుతాం” అని తెలిపారు. తమ పార్టీ లీడర్ పై దాడి విషయంలో సూరత్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, సూరత్ లోని 12 సీట్లలో 7 సీట్లు ఆప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.