24 గంటల్లో 112 మి.మీ వాన.. 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్

24 గంటల్లో 112 మి.మీ వాన.. 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్

భారీ వర్షానికి ఢిల్లీ వణికిపోతోంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు కాలనీలు మునిగిపోయాయి. రోడ్లు చెరువుల్లా మారాయి. చెట్లు నేలకూలాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షాలు, వరదలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఢిల్లీ సిటీలో 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసింది. 24గంటల్లో 112.1 మిల్లీమీటర్ల వాన పడింది. 2010 సెప్టెంబర్ 20న కురిసిన 110 మిల్లీ మీటర్ల వర్షం ఇప్పటివరకు రికార్డ్. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుందని ఢిల్లీ-NCRకు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆరంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది IMD. ఈనెల 4 వరకు భారీ వర్షాలుంటాయని తెలిపింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ మునిగినంత పనైంది. సిటీలోని కన్నోట్ ప్లేస్, గోల్ఫ్ క్లబ్ రోడ్, అక్షర్ ధామ్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, లోధీ రోడ్, అక్బర్ రోడ్, సాకేత్, BD మార్గ్, మాన్ సింగ్ రోడ్ ఇలా అన్ని చోట్ల రాత్రి నుంచి ఆగకుండా వాన కురిసింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. సౌత్ అవెన్యూ, అక్బర్ రోడ్, ధోలా కౌన్ ప్రాంతాల్లో రెండు ఫీట్ల ఎత్తులో నీరు ఆగింది. అండర్ పాస్ లు మునిగిపోయాయి. జన్ పథ్ ఏరియాలో చెట్టు కూలడంతో... వాహనాలు ధ్వంసం అయ్యాయి. నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జాం అవుతోంది. సౌత్‌ ఢిల్లీలోని అనేక ఏరియాల్లో ఇండ్లలోకి కూడా మోకాళ్ల లోతుకు నీళ్లు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.

నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలమైన గురుగ్రామ్, మనేసర్, ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇందిరాపురం, లోనీ దేహాత్, గాజియాబాద్, దాద్రిలలో రాత్రంతా భారీ వర్షం కురిసింది. గురుగ్రామ్ రోడ్డుపై మూడు ఫీట్ల ఎత్తులో నీళ్లు నిలిచిపోయాయి. నడుంలోతులో నీరు ఆగడంతో... రోడ్లపైకి వచ్చిన వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ఆగిపోయింది. వాహనాల్లోకి నీరు చేరడంతో... అవి ముందుకు కదలడంలేదు. తోసుకుంటూ నీళ్ల నుంచి బయటపడేందుకు ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు.