డబ్ల్యూపీఎల్‎లో బోణీ కొట్టిన ఢిల్లీ.. 7 వికెట్ల తేడాతో యూపీపై విజయం

డబ్ల్యూపీఎల్‎లో బోణీ కొట్టిన ఢిల్లీ.. 7 వికెట్ల తేడాతో యూపీపై విజయం

నవీ ముంబై: రెండు వరుస పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ డబ్ల్యూపీఎల్‌‌లో బోణీ చేసింది. ఛేజింగ్‌‌లో లిజెల్లీ లీ (67), షెఫాలీ వర్మ (36) రాణించడంతో.. బుధవారం చివరి వరకు ఉత్కంఠగా సాగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌‌పై నెగ్గింది. టాస్‌‌ ఓడిన ఢిల్లీ ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా.. యూపీ 20 ఓవర్లలో 154/8 స్కోరు చేసింది. కెప్టెన్‌‌ మెగ్‌‌ లానింగ్‌‌ (54) టాప్‌‌ స్కోరర్‌‌. హర్లీన్‌‌ డియోల్‌‌ (47) ఆకట్టుకుంది. 

ఇన్నింగ్స్‌‌ మూడో బాల్‌‌కే కిరణ్‌‌ నవ్‌‌గిరే (0) డకౌట్‌‌ కాగా, లానింగ్‌‌ కీలక ఇన్నింగ్స్‌‌ ఆడింది. దాంతో పవర్‌‌ప్లేలో యూపీ 47/1 స్కోరు చేసింది. వన్‌‌డౌన్‌‌లో లిచ్‌‌ఫీల్డ్‌‌ (27) మెరుగ్గా ఆడి రెండో వికెట్‌‌కు 47 రన్స్‌‌ జత చేసి వెనుదిరిగింది. ఈ దశలో వచ్చిన డియోల్‌‌ అద్భుతంగా ఇన్నింగ్స్‌‌ను నడిపించింది. మూడో వికెట్‌‌కు 85 రన్స్‌‌ జత చేసి లానింగ్‌‌ వెనుదిరిగినా.. డియోల్‌‌ వేగంగా ఆడింది. అయితే 17వ ఓవర్‌‌లో ఆమె రిటైర్డ్‌‌ హర్ట్‌‌ కావడంతో యూపీ ఇన్నింగ్స్‌‌ తడబడింది. 

పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు రన్స్‌‌ను కట్టడి చేశారు. దాంతో  శ్వేత షెరావత్‌‌ (11), చోలే ట్రయాన్‌‌ (1), సోఫీ ఎకెల్‌‌స్టోన్‌‌ (3), ఆశా శోభన (1 నాటౌట్), దీప్తి శర్మ (2), శిఖా పాండే (2 నాటౌట్‌‌) బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. 11 రన్స్‌‌ తేడాతో ఐదు వికెట్లు పడటం యూపీ ఇన్నింగ్స్‌‌ను దెబ్బతీసింది. మారిజానె కాప్‌‌, షెఫాలీ వర్మ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో ఢిల్లీ 20 ఓవర్లలో 158/3 స్కోరు చేసింది. స్టార్టింగ్‌‌లో యూపీ బౌలర్లను ఓపెనర్లు షెఫాలీ, లిజెల్లీ ఓ ఆటాడుకున్నారు.

ఫోర్లు, సిక్సర్లతో బెంబెలేత్తించడంతో పవర్‌‌ప్లేలో 46 రన్స్‌‌ వచ్చాయి. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత కూడా ఈ ఇద్దరి దూకుడు ఏమాత్రం తగ్గలేదు. స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూనే వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టారు. దాంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో ఢిల్లీ 87/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. 12వ ఓవర్‌‌లో శోభన (1/20) షెఫాలీని ఔట్‌‌ చేసి తొలి వికెట్‌‌కు 94 రన్స్‌‌ భాగస్వామ్యాన్ని ముగిచింది. ఆ వెంటనే మారిజానె కాప్‌‌ (2/26) మరో స్ట్రోక్‌‌ ఇచ్చింది. 31 బాల్స్‌‌లో ఫిఫ్టీ కొట్టిన లిజెల్లీని పెవిలియన్‌‌కు పంపింది. 

114/2తో ఉన్న దశలో వచ్చిన లారా వోల్‌‌వర్త్‌‌ (25 నాటౌట్‌‌), జెమీమా రోడ్రిగ్స్‌‌ (21) నిలకడగా ఆడారు. యూపీ బౌలర్లు పుంజుకునే ప్రయత్నం చేసినా ఎక్కడా చాన్స్‌‌ ఇవ్వలేదు. పరస్పరం స్ట్రయిక్‌‌ను మార్చుకుంటూ  మూడో వికెట్‌‌కు 34 రన్స్‌‌ జత చేసి గెలుపు దిశగా తీసుకెళ్లారు. 19వ ఓవర్‌‌లో జెమీమా ఔట్‌‌తో మ్యాచ్‌‌లో ఉత్కంఠ పెరిగింది. ఇక బాల్‌‌కు ఓ రన్‌‌ చేసే క్రమంలో లారా, మారిజానె కాప్‌‌ (5 నాటౌట్‌‌) నెమ్మదిగా ఆడి చివరి బాల్‌‌కు విజయాన్ని అందించారు. లిజెల్లీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.