
ప్రధానికి లేఖ రాసిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్
ఉత్తర్ ప్రదేశ్ : అలీగఢ్ జిల్లా తప్పాల్ లో రెండున్నరేళ్ల బాలిక ట్వింకిల్ శర్మ రేప్ అండ్ మర్డర్ కేస్ సంచలనంగా మారింది. అలీగఢ్ లో స్థానికులు, హిందూత్వ సంఘాలు ఇప్పటికీ నిరసనలు తెలుపుతున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న యూపీ ప్రభుత్వం… సున్నిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించాయి. న్యాయం జరుగుతుందని బాధితులకు, మద్దతుదారులకు భరోసా ఇస్తూనే… బందోబస్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.
అలీగఢ్ లోని తప్పాల్ లో రెండున్నరేళ్ల బాలికను రేప్ చేసి చంపిన నిందితులను ఉరి తీయాలని ఢిల్లీ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. ఈ సంఘటన చాలా దారుణమని ఆమె అన్నారు. నిందితులకు మరణ శిక్ష వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లెటర్ రాశారు.
తండ్రి అనారోగ్య చికిత్స ఖర్చుల కోసం తప్పాల్ లోని ఓ వ్యక్తి నుంచి భన్వరీలాల్ శర్మ అనే కూలీ రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. ఈ బాకీ తీర్చకుంటే అంతు చూస్తానని అప్పు ఇచ్చిన వ్యక్తులు హెచ్చరించారు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. మే 31 నుంచి భన్వరీలాల్ కూతురు ట్వింకిల్ శర్మ కనిపించలేదు. జూన్ 2న ఓ చెత్తకుప్ప పక్కన.. దారుణ పరిస్థితుల్లో శవమై కనిపించింది. చిన్నారి ట్వింకిల్ శర్మను రేప్ చేసి చంపారని బాధితులు కేసు పెట్టారు. ఈ కేసులో నిందుతుడు జహీద్ ను జూన్ 4న పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 8న భార్య షగుఫ్తా, జహీద్ సోదరుడు మెహిందీ హసన్ లను అరెస్ట్ చేశారు. జూన్ 4న అస్లాం అనే 43 వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతడిపై 2014, 2017లో POCSO(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ) చట్టం కింద కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకు ఐదుగురు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. సీఎంను కలవాలని యూపీ సీఎంఓ ఆఫీస్ కోరినా… బాధితులు వినలేదు. న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని చెప్పారు. స్థానికులు, హిందూత్వసంఘాలు నిరసన కొనసాగిస్తున్నాయి. అలీగఢ్ నుంచి తప్పాల్ కు వెళ్లాలనుకున్న సాధ్వి ప్రాచీని ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు.