ప్రాణం తీస్తున్న డెలివరీ

ప్రాణం తీస్తున్న డెలివరీ

ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కిరాణా సామాన్ల డెలివరీ స్టార్టప్​ల మధ్య పోటీ ఉద్యోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. మనదేశంలో డెలివరీ స్టార్టప్​లు క్విక్​ కామర్స్​పై ఫోకస్​ చేశాయి. కొన్ని సిటీల్లో కేవలం పది నిమిషాల్లో డెలివరీ ఇస్తున్నాయి. ఇలా స్పీడ్​గా డెలివరీ చేసే వ్యాపారాన్ని క్విక్​ కామర్స్​గా పిలుస్తున్నారు. నిమిషాల్లో కస్టమర్​ఇంటికి చేరుకోవడానికి డెలివరీ ఏజెంట్​ ఉరుకులుపరుగులు పెడుతున్నాడు. కొన్నిసార్లు ట్రాఫిక్​ రూల్స్​ను పాటించడం లేదనే ఫిర్యాదులూ వస్తున్నాయి. ఫలితంగా యాక్సిడెంట్లు జరిగి ఆస్పత్రులు పాలవుతున్నారు. ఇండియా గ్రాసరీ రిటైల్​ మార్కెటింగ్​ విలువ 600 బిలియన్​ డాలర్ల వరకు ఉండటంతో ఈ రంగంలో అవకాశాల కోసం అమెజాన్​, ఫ్లిప్​కార్డ్​వంటి బడా కంపెనీలు ఎగబడుతున్నాయి. సాఫ్ట్​బ్యాంకుకు చెందిన మరో డెలివరీ స్టార్టప్ బ్లింకిట్, దీని పోటీ కంపెనీ​ జెప్టో కూడా క్విక్​కామర్స్​లో దూసుకెళ్లడానికి వందలాది మందిని నియమించుకుంటోంది.  

ఇవి ఎలా డెలివరీ ఇస్తాయంటే...
డెలివరీ స్టార్టప్​లు సిటీలో జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని డార్క్​ స్టోర్లు లేదా చిన్న గోదాములను ఏర్పాటు చేసుకుంటున్నాయి.   కస్టమర్ నుంచి ఆర్డర్​ రాగానే ఏజెంట్​​ అక్కడి నించి నిమిషాల్లో కస్టమర్​ ఇంటికి చేరుకుంటాడు. క్విక్​ కామర్స్​ వల్ల పెద్ద రిటైల్​ కంపెనీలకు ప్రమాదమని ఆంబిట్​ క్యాపిటల్​ ఐటీ సెక్టార్​ ఎనలిస్టు అశ్విన్​ మెహతా అన్నారు. జనం క్విక్​ డెలివరీలకు అలవాటు పడితే మిగతా కంపెనీలన్నీ ఇదే విధంగా డెలివరీ ఇవ్వాల్సి ఉంటుందని, దీనివల్ల ప్రమాదాలకు అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కన్సల్టెన్సీ ఫర్మ్​ రెడ్​సీర్​ అంచనాల ప్రకారం క్విక్​కామర్స్​సెక్టార్​ గత ఏడాది 300 మిలియన్​ డాలర్ల విలువైన ఆర్డర్లను సాధించింది. అయితే 2025 నాటికి దీని మార్కెట్​సైజు ఐదు బిలియన్​ డాలర్లకు పెరుగుతుందని అంచనా. స్టాన్​ఫోర్డ్ వర్సిటీలో​ చదువుకున్న స్టూడెంట్లు బ్లింకిట్​, జెప్టోలను ప్రారంభించారు. ఆహార పదార్థాలను నిమిషాల్లోనే తెచ్చివ్వడంతో కస్టమర్లను ఇవి ఆకట్టుకుంటున్నాయి. నచ్చిన వస్తువులు తక్షణమే ఇంటికి రావడం కస్టమర్లకు ఎంతో నచ్చిందని, దీనివల్ల సిటీ జనం జీవన విధానమే మారిపోయిందని షర్మిష్ట లాహిరీ అనే హౌస్​వైఫ్​ అన్నారు. టొమాటోలో ఆలుగడ్డలో అయిపోతే నిమిషాల్లో తెప్పించుకునే వెసులుబాటు రావడం కచ్చితంగా ఉపయోగకరమేనని గురుగ్రామ్​వాసి స్పష్టం చేశారు.  యూరప్​, అమెరికా వంటి దేశాల్లోనూ డెలివరీ స్టార్టప్​లు క్విక్​ డెలివరీలు ఇస్తున్నాయి కానీ అక్కడి రోడ్లు విశాలంగా ఉండటం, ట్రాఫిక్​ రూల్స్ కచ్చితంగా పాటించడం వల్ల పెద్దగా ఇబ్బందులు రావడం లేదు. ఇండియాలో రోడ్లు బాగుండవు కాబట్టి క్విక్​ కామర్స్​ ప్రమాదకరమైన బిజినెస్ అని ఎనలిస్టులు చెబుతున్నారు. ‘‘పది నిమిషాల్లో డెలివరీ అంటే చాలా చాలా తక్కువ సమయం. ఇది కచ్చితంగా అభ్యంతరం చెప్పాల్సిన విషయం’’అని కేంద్ర మాజీ రోడ్​ సెక్రటరీ విజయ్​ చిబ్బర్​ అన్నారు. 

డ్రైవర్లకు నరకమే...
దేశంలోని చాలా సిటీల్లో రోడ్లు గుంతలతో కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా స్పీడ్​ బ్రేకర్లు ఉంటున్నాయి. రోడ్లపై నీళ్లు నిలవడం సర్వసాధారణం.  వీధి జంతువులు తిరగడం మామూలు విషయమే! వీటన్నింటినీ దాటుకుంటూ మోటరిస్టులు ప్రయాణం చేయాలి. అందుకే మనదగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ. ప్రపంచబ్యాంకు గత ఏడాది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం ఇండియాలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రోడ్​ యాక్సిడెంట్ అవుతోంది. ఏటా కనీసం 1.50 లక్షల మంది మరణిస్తున్నారు. డెలివరీ తొందరగా ఇవ్వాలంటూ తమ బాసులు ఒత్తిడి తెస్తున్నారని బ్లింకిట్​, జెప్టోల డెలివరీ ఏజెంట్లు చెబుతున్నారు. ‘‘డెలివరీకి మాకు కొన్నిసార్లు ఐదారు నిమిషాలే టైమిస్తారు. అప్పుడు చాలా టెన్షన్​గా అనిపిస్తుంది. ప్రాణభయం ఉంటుంది”అని బ్లింకిట్​ డ్రైవర్​ వివరించారు. తన పేరును బయటపెట్టవద్దని ఆయన కోరారు. దీనిపై బ్లింకిట్​ సీఈఓ గతంలో వివరణ ఇస్తూ డెడ్​లైన్​లోపే డెలివరీ ఇవ్వాలని బలవంతం చేయడం లేదని స్పష్టం చేశారు.