మామూలు సర్ది కన్నా వేగంగా వ్యాప్తిస్తున్న ‘డెల్టా’ వైరస్

మామూలు సర్ది కన్నా వేగంగా వ్యాప్తిస్తున్న ‘డెల్టా’ వైరస్
  • కొత్త వైరస్‌లా విస్తరిస్తోంది
  • చికెన్ పాక్స్, మామూలు సర్ది కన్నా వేగంగా వ్యాప్తి
  • ఇతర వేరియంట్లతో పోలిస్తే మరింత డేంజర్
  • టీకా వేసుకున్నోళ్లనూ వదల్తలే
  • అమెరికా సీడీసీ నివేదికలో వెల్లడి

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనాలో ‘డెల్టా’ రకం దాదాపు ఓ ‘కొత్త వైరస్’​లా పనిచేస్తోందట. చికెన్​పాక్స్, మీజిల్స్ అంత అల్కగా జనానికి అంటుతోందట. ఇతర కరోనా రకాలతో పోలిస్తే మరింత ఆపతిని తెస్తోందట. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చేసిన స్టడీలో ఈ విషయాలు బయటపడ్డాయి. ఎబోలా, మామూలు సర్ది కన్నా వేగంగా డెల్టా వేరియంట్ ఒకళ్ల నుంచి ఇంకొకళ్లకు అంటుకుంటోందని సీడీసీ పేర్కొంది. మరణాల రేటు ఎక్కువగా ఉన్న సార్స్, ఎబోలా మాదిరే ఇది ప్రాణాంతకమైన వేరియంట్ అని, వ్యాక్సిన్ వేసుకున్నోళ్లనూ వదలట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది.

వైరల్ లోడ్ ఎక్కువ

వ్యాక్సిన్ వేసుకోని వ్యక్తుల్లో డెల్టా వేరియంట్ వైరల్ లోడ్ ఎంతుంటుందో.. టీకా తీసుకున్నోళ్లలోనూ అంతే ఉంటోందని సీడీసీ తన నివేదికలో పేర్కొంది. టీకా తీసుకున్న వారి నుంచీ డెల్టా వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది. వృద్ధులు ఎక్కువగా ఆస్పత్రులపాలయ్యే అవకాశం ఉందని, యువతలోనే దాని వల్ల మరణాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వేసుకున్నోళ్లలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నా జబ్బు తీవ్రత తక్కువగానే ఉంటుందని సీడీసీ పేర్కొంది. వ్యాక్సిన్లు జబ్బు తీవ్రతను 90 శాతం వరకు తగ్గిస్తాయని తెలిపింది.

ఆర్‌‌‌‌ వ్యాల్యూ భయపెడుతున్నది

కరోనా కేసులు మెల్లగా ఎక్కువైతున్నయ్. ఆర్ వ్యాల్యూ (కరోనా రీ ప్రొడక్షన్ రేటు) పెరుగుదల భయపెడుతోంది. ఆర్ వ్యాల్యూ పెరగడం వల్లే కేరళ, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల్లో కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. కేరళలో ప్రస్తుతం సగటున రోజూ 22 వేల కేసులు నమోదవుతున్నాయి. యాక్టివ్ కేసుల్లో 37 శాతం ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఆర్ వ్యాల్యూ 1.11 గా ఉంది. అంటే ప్రతి 100 మంది కరోనా రోగుల నుంచి 111 మందికి వైరస్‌‌ వ్యాప్తి చెందుతోంది. ఆర్‌‌ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే.. కేసులు అదుపులోకి వస్తున్నట్లుగా భావిస్తారు. కర్నాటకలో బుధవారం 1,531 కేసులు నమోదు కాగా, గురువారానికి 2,052 వచ్చాయి. ఒక్క రోజులోనే 34 శాతం కేసులు పెరిగాయి. 

మిడిల్ ఈస్ట్‌‌లో ఫోర్త్ వేవ్: డబ్ల్యూహెచ్‌‌వో

డెల్టా వేరియంట్ వల్ల మిడిల్ ఈస్ట్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితి ఫోర్త్ వేవ్‌‌కు దారితీస్తోందని డబ్ల్యూహెచ్‌‌వో ఆందోళన వ్యక్తం చేసింది. మిడిల్ ఈస్ట్‌‌లోని 15 దేశాల్లో డెల్టా కేసులు నమోదవుతున్నాయిని హెచ్చరించింది. ‘‘కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారు, హాస్పిటలైజ్ అవుతున్న వాళ్లలో ఎక్కువగా వ్యాక్సిన్ వేసుకోని వాళ్లే ఉంటున్నారు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌‌లో ఫోర్త్ వేవ్ వచ్చింది” అని తెలిపింది.  మిడిల్ ఈస్ట్‌‌లోని 5.5 శాతం మంది మాత్రమే ఫుల్‌‌గా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు చెప్పింది. కొత్త కేసులు 55 శాతం, డెత్స్ 15 శాతం పెరిగాయి. అత్యధికంగా అమెరికా, బ్రెజిల్, ఇండోనేసియా, బ్రిటన్, ఇండియాలో కేసులు పెరిగాయి.