జస్ట్ మిస్.. లేదంటే ఊహించలేని విషాదం: గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‎లో మంటలు

జస్ట్ మిస్.. లేదంటే ఊహించలేని విషాదం: గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‎లో మంటలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తృటిలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న డెల్టా ఎయిర్ లైన్స్‎కు చెందిన బోయింగ్ 767-400  విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‎లో మంటలు చెలరేగాయి. శనివారం (జూలై 19) లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమానం అట్లాంటాకు బయలుదేరగా.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఫ్లైట్ ఇంజిన్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విషయాన్ని ఏటీసీకి తెలియజేసి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‎కు అనుమతి కోరాడు. ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తిరిగి లాస్ ఏజెంల్స్ ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. 

ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా విమానం సేఫ్‏గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‎లో మంటలు చెలరేగిన దృశ్యాలు ఎయిర్ పోర్టు గ్రౌండ్ వీడియో ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

ఈ ఘటనపై డెల్టా ఎయిర్ లైన్స్ స్పందించింది. ‘‘డెల్టా విమానం 446 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ ఎడమ ఇంజిన్‌లో మంటలు రావడంతో లాస్ ఏంజిల్స్‌లో తిరిగి ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో విమానం ఇంజిన్‎లో మంటలు ఆగిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు’’ అని తెలిపింది. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడించింది.