చైనాలో కరోనా అలజడితో భారత్‭లో అలర్ట్

చైనాలో కరోనా అలజడితో భారత్‭లో అలర్ట్
  • బూస్టర్‌‌ డోస్‌‌కు డిమాండ్
  • చైనాలో కరోనా అలజడితో మన దగ్గర అలర్ట్
  • ముందు జాగ్రత్తగా టీకా వేయించుకునేందుకు జనం ఆసక్తి
  • సెకండ్ బూస్టర్‌‌‌‌ వేయించుకునేందుకూ రెడీ!
  • కొత్త వేరియంట్లపై ఇప్పుడున్న వ్యాక్సిన్లు పని చేస్తయా?
  • టీకాల ఎఫికసీపై అనుమానాలు
  • సెకండ్ బూస్టర్‌‌‌‌ విషయంలో రిస్క్‌‌ వద్దంటున్న నిపుణులు

హైదరాబాద్, వెలుగు:  చైనాలో కరోనా అలజడితో మన దగ్గర బూస్టర్ డోసుకు డిమాండ్ పెరుగుతున్నది. ఇన్నాళ్లు బూస్టర్ వేసుకోకుండా ఉన్న జనాలు.. ఇప్పుడు వ్యాక్సిన్‌‌ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నది. అయితే ఎప్పుడో కరోనా పాత వేరియంట్లను ఎదుర్కొనేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లు.. ఇప్పుడొస్తున్న కొత్త వేరియంట్లపై ఎంతవరకు పనిచేస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ 2020లో వుహాన్‌‌లో వ్యాపించిన వైరస్ స్ర్టెయిన్‌‌ను బేస్‌‌ చేసుకునే తయారు చేశారు. తర్వాత వైరస్‌‌ చాలాసార్లు మ్యుటేట్ అయ్యి, కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. సెకండ్ వేవ్‌‌లో వచ్చిన డెల్టా, థర్డ్ వేవ్‌‌లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్లు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు కూడా సోకాయి. ఇప్పుడు వస్తున్న ఎక్స్‌‌బీబీ, బీఎఫ్‌‌7 వేరియంట్లు ఒమిక్రాన్‌‌ నుంచి వచ్చిన సబ్‌‌ వేరియంట్లకు సబ్ వేరియంట్లు. ఈ ఫోర్త్, ఫిఫ్త్‌‌ జనరేషన్ వేరియంట్లపై మొదటి జనరేషన్ వేరియంట్లను బేస్‌‌ చేసుకుని తయారు చేసిన వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తాయో ఇప్పుడే చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. 

వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కూడా కొత్త వేరియంట్లపై తమ వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయో స్టడీ చేయలేదు. కొన్ని కంపెనీలైతే కొత్త వేరియంట్లపై పనిచేసే వ్యాక్సిన్లను డెవలప్‌‌ చేస్తున్నామని ప్రకటించాయి. ఈ ప్రకటనలు కొత్త వేరియంట్లపై పాత వ్యాక్సిన్ల సమర్థతను ప్రశ్నిస్తున్నట్టే ఉన్నాయని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, యంగ్ ఏజ్‌‌లో ఉన్నవాళ్లు బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేయించుకోకపోయినా ఫర్వాలేదని, వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే రోగులు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

సెకండ్ బూస్టర్‌‌‌‌ రిస్క్

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌‌లో లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. అప్పటి భయం జనాల్లో ఇప్పటికీ ఉంది. దీంతో కొంత మంది సెకండ్ బూస్టర్ వేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది అవుతున్నది. ఈ ఏడాది జనవరిలో హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌‌లైన్ వర్కర్లు, వృద్ధులు బూస్టర్‌‌ ‌‌డోసు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. గ్రామాల్లో కంటే అర్బన్ ఏరియాల్లో నివసించే సీనియర్ సిటిజన్స్ బూస్టర్‌‌‌‌ డోసు ఎక్కువగా తీసుకున్నారు. బూస్టర్ తీసుకుని ఆరు నెలలు దాటడం, మళ్లీ కరోనా వ్యాప్తి మొదలవడంతో సెకండ్ బూస్టర్‌‌‌‌పై వీరు ఆసక్తి చూపిస్తున్నారు. వాస్తవానికి మొదట్లో సెకండ్‌‌ డోసుకు, బూస్టర్ డోసుకు మధ్య 9 నెలల గ్యాప్ ఉండేది. తర్వాత ఐసీఎంఆర్ దీన్ని ఆరు నెలలకు తగ్గించింది. వ్యాక్సిన్ ప్రభావం ఆరు నెలల్లో తగ్గిపోతుందని, అందుకే ఆ తర్వాత బూస్టర్ తీసుకోవాలని పలు రీసెర్చ్‌‌లు పేర్కొన్నాయి. సిటీ జనాలు సెకండ్ బూస్టర్‌‌‌‌పై ఆసక్తి చూపించడానికి ఇది కూడా ఓ కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. అయితే బూస్టర్‌‌‌‌కు, సెకండ్ బూస్టర్‌‌‌‌కు ఎంత గ్యాప్ ఉండాలి? అసలు సెకండ్ బూస్టర్ అవసరమా? అనే దానిపై ఇప్పటిదాకా మన దేశంలో స్టడీస్ ఏవీ రాలేదు. ఈ నేపథ్యంలో సెకండ్ బూస్టర్‌‌‌‌ డోసుకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు ‘‘ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ప్రకటన వచ్చే దాకా సెకండ్ బూస్టర్ వేసుకోవడం మంచిది కాదు. సెకండ్ బూస్టర్‌‌‌‌ వేసుకుంటే జరిగే పరిణామాలపై స్టడీస్‌‌ లేవు. అనవసరంగా రిస్క్ చేయొద్దు’’ అని డాక్టర్ కిరణ్ మాదాల హెచ్చరించారు.

అన్నీ ‘ఎమర్జెన్సీ’ వ్యాక్సిన్లే .. ఫుల్ పర్మిషన్ ఇయ్యలే

కరోనా నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌‌ జరగకుండానే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లకు అప్రూవల్ ఇచ్చింది. ఎమర్జెన్సీ యూజ్‌‌ అప్రూవల్స్‌‌గా వీటిని పేర్కొన్నారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్‌‌ తదితర వ్యాక్సిన్లకు పర్మిషన్లు వచ్చి రెండేండ్లు అవుతున్నది. ఇప్పటికే కోట్ల మంది జనాలకు ఈ వ్యాక్సిన్లను ఇచ్చారు. వాటి సైడ్ ఎఫెక్ట్స్‌‌పై ఎన్నో విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయినా అనుమానాలు నివృత్తి చేసే ప్రకటనలు ఇప్పటిదాకా డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఐసీఎంఆర్ నుంచి రాలేదు. ఎమర్జెన్సీ అప్రూవల్‌‌ నుంచి పూర్తి స్థాయిలో అప్రూవల్ కూడా ఆ వ్యాక్సిన్లకు ఇవ్వలేదు. ఈ లెక్కన ఇంకెన్ని సంవత్సరాలు ఎమర్జన్సీ అప్రూవల్‌‌తోనే జనాలకు వ్యాక్సిన్లు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎమర్జెన్సీ పరిస్థితులు లేనప్పుడు, పూర్తిస్థాయి అప్రూవల్ లేని వ్యాక్సిన్లను ఎందుకు వినియోగించాలని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ల సమర్థత, వాటి అవసరాన్ని ప్రశ్నించే వారిపై వివక్ష చూపుతున్నారన్న భయంతో, బహిరంగంగా ఈ విషయాన్ని మాట్లాడేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు.

సెకండ్ బూస్టర్ అక్కర్లేదు

మన దేశంలో బూస్టర్ డోసు వరకే పర్మిషన్ ఉంది. కానీ ప్రస్తుతం సెకండ్ బూస్టర్‌‌పై చర్చ జరుగుతున్నది. బూస్టరైనా, సెకండ్ బూస్టరైనా జనాలను వైరస్ నుంచి ఎంతవరకు రక్షిస్తాయన్నదే తేలాల్సిన అవసరం ఉంది.  దేశంలో, రాష్ట్రంలో మరొకసారి సీరో సర్వే చేయించాలి. ఒకవేళ జనాల్లో యాంటిబాడీస్ ఉంటే, అసలు వ్యాక్సినేషన్ అవసరమే ఉండదు. ఆ యాంటిబాడీస్ ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయనే దానిపై కూడా స్టడీస్ చేయొచ్చు. ఒకవేళ యాంటిబాడీస్ లేవని తేలితే, అప్పుడు బూస్టర్ డోసు లేదా సెకండ్ బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకోవచ్చు. అవేవీ చేయకుండా డోసుల మీద డోసులు తీసుకోవడం మంచిది కాదు. ఆ అవసరం, అంత ఎమర్జెన్సీ పరిస్థితులు కూడా కనిపించడం లేదు.
-డాక్టర్ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా