డేటా సెంటర్లకు పెరిగిన డిమాండ్

డేటా సెంటర్లకు పెరిగిన డిమాండ్


న్యూఢిల్లీ: మల్టీనేషనల్​ కంపెనీలన్నీ ఇండియాలో జరిపే ట్రాన్సాక్షన్ల డేటాను కచ్చితంగా ఇక్కడి సర్వర్లలోనే స్టోర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో డేటా సెంటర్లకు డిమాండ్​ విపరీతంగా పెరిగింది. డెల్, యాక్సెంచర్, ఎన్​టీటీ గ్లోబల్, ఐబీఎం, ఫ్లిప్​కార్ట్, ఐసీఐసీఐ, క్యాప్​జెమినీ, వెల్స్​ఫార్గో, ఒరాకిల్, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ వంటి బడా కంపెనీలు భారతదేశంలో పెద్ద డేటా సెంటర్లను  నిర్వహిస్తున్నాయి. వీటిలో పనిచేయడానికి వేలాది మంది అవసరం కావడంతో కంపెనీలు ట్యాలెంట్​ కోసం వేటలో పడ్డాయి. డేటా లోకలైజేషన్​కు, డిజిటల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను పెంచడంలో ఇవి ఎంతో కీలకం. ఎంటర్​ప్రైజ్​ డేటా సెంటర్​, కమర్షియల్​క్లౌడ్​ సేవలు కూడా అందించే అమెరికన్​ కంపెనీలు అమెజాన్, గూగుల్​, మైక్రోసాఫ్ట్‌‌లకూ భారీగా ఉద్యోగుల అవసరం ఉందని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్​ డేటా సెంటర్లకు నాన్​ టెక్నికల్​ స్టాఫ్ కూడా భారీగా కావాలి. డేటా సెంటర్లకు ఎక్విప్​మెంట్​ను  చూసుకోవడానికి సిస్టమ్​ ఇంజనీర్లతోపాటు నెట్​వర్క్​ మేనేజర్లు, ప్రొడక్ట్​ మేనేజర్లు, అడ్మినిస్ట్రేటివ్​ స్టాఫ్ ​కావాల్సి ఉంటుందని అమెరికా డేటా సెంటర్​ ఫర్మ్​ ఈక్వినిక్స్​ ఎండీ మనోజ్​ పాల్​ అన్నారు. డేటా సెంటర్లను నిర్మించడం మొదలుకొని నిర్వహించడం వరకు.. ఇలా ప్రతి స్టేజీలోనూ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తారని వివరించారు. 


జాబ్స్​ ఇవ్వడానికి రెడీ...

కేవలం గత రెండు వారాల్లో డేటా సెంటర్​ కంపెనీల్లో ఎనిమిది వేల పొజిషన్లకు రెజ్యుమేలను ఆహ్వానించాయని స్పెషలిస్ట్ స్టాఫింగ్​ ఫర్మ్​ ఫెనో పేర్కొంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల కెపాసిటీ రెట్టింపు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల సంఖ్య మరింత పెరుగుతుందని ఈ కంపెనీ కో–ఫౌండర్​ కమల్​ కారంత్​​ అన్నారు. ముంబై, చెన్నై, పూణే, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌‌‌‌‌‌‌‌కతా అంతటా డేటా సెంటర్ల ప్రస్తుత ఇన్​స్టాల్డ్​ కెపాసిటీ 500 మెగావాట్లు కాగా, ఇవి10.5 మిలియన్ చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి.  రాబోయే రెండేళ్లలో ఈ కెపాసిటీకి 990 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. అయితే ఉద్యోగుల సంఖ్య ఇంత వేగంగా పెరగకపోవచ్చని కారంత్​ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో డేటా సెంటర్ పరిశ్రమకు మౌలిక సదుపాయాల హోదాను మంజూరు చేయడం వల్ల వీటికి డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 2025 నుంచి డేటా సెంటర్లకు గిరాకీ తారస్థాయికి చేరుకుంటుందని గ్రేహౌండ్​ రీసెర్చ్​ చీఫ్​ ఎనలిస్ట్​ సంచిత్​ వీర్​ గోగియా అన్నారు. ప్రభుత్వం డేటా సెంటర్లకు తగినంత కరెంటు ఇవ్వాలన్నారు.

భారీ పెట్టుబడులు

నాస్కామ్ ఫిబ్రవరి 2021 రిపోర్టు ప్రకారం, భారతదేశంలో డేటా సెంటర్ల కోసం పెట్టుబడులు 2025 నాటికి సంవత్సరానికి  4.6 బిలియన్​ డాలర్లకు చేరుకుంటాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్,  ఢిల్లీలో ప్రధాన డేటా సెంటర్లు ఉన్నాయి. క్వాలిటీ ఫైబర్ కనెక్టివిటీ, కస్టమర్లకు చేరువగా ఉండటం, నైపుణ్యం కలిగిన వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ దొరకడం, సబ్​మెరైన్​ కేబుల్ కనెక్టివిటీ వంటివి అందుబాటులో ఉండటం ఇందుకు ముఖ్యమైన కారణాలు. స్కిల్డ్​ వర్క్​ఫోర్స్​ ఎక్కువగా ఉన్న చోట డేటా సెంటర్లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయని నాస్కామ్​ పేర్కొంది. నార్త్​ అమెరికా, వెస్ట్​ యూరప్​లో తగినంత ఇంజనీరింగ్​ ట్యాలెంట్ లేక కంపెనీలన్నీ ఇండియావైపు చూస్తున్నాయని రిపోర్టు పేర్కొంది. డిమాండ్​ తీర్చాలంటే ఇండియాలో ఇప్పుడున్న డేటా సెంటర్ల కెపాసిటీ కనీసం పది రెట్లు పెరగాలని యోటా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సీఈఓ సునీల్​ చెప్పారు. డేటా సెంటర్​ నడపడానికి, కస్టమర్​ సర్వీసులు అందించడానికి కనీసం వెయ్యి మంది అవసరమవుతారని చెప్పారు. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్లను నిర్మించడానికి అదనంగా 2,500 మందిని ఇన్​డైరెక్ట్​గా నియమించుకుంటామని ఆయన వెల్లడించారు. వీటి నిర్మాణం కోసం రాబోయే ఏడేళ్లలో రూ.15 వేల కోట్లు ఇన్వెస్ట్​ చేస్తామని వెల్లడించారు. క్లౌడ్​నెట్​వర్కింగ్​, ఇతర ఐటీ ఇన్​ఫ్రా సేవలను అందిస్తామని సునీల్​ వివరించారు.