పిల్లలకూ స్టాక్ మార్కెట్.. మైనర్ డీమ్యాట్ ఖాతా ఎలా తెరవాలి? ప్రయోజనాలేంటి?

పిల్లలకూ స్టాక్ మార్కెట్.. మైనర్ డీమ్యాట్ ఖాతా ఎలా తెరవాలి? ప్రయోజనాలేంటి?

డీమ్యాట్ ఖాతా.. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ పదం సుపరిచితమే. పెట్టుబడిదారులు తాము కొనుగోలు చేసిన లేదా విక్రయించే షేర్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిల్వ చేయడానికి డీమ్యాట్ ఖాతా అనేది తప్పనిసరి. డీమ్యాట్ ఖాతాలను సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL) మరియు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) సంస్థలు నిర్వహిస్తాయి.

సాధారణంగా 18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా డీమ్యాట్ ఖాతా తెరవచ్చు. అదనంగా, జాయింట్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్ సంస్థలు మరియు నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు) డీమ్యాట్ ఖాతాలను తెరవవచ్చు. ఇక పిల్లల విషయానికొస్తే.. చట్ట ప్రకారం, మైనర్లు ఆర్థిక ఒప్పందాలు చేయడానికి లేదా భాగస్వామిగా ఉండటానికి అనుమతించబడరు. అయితే, 2013 కంపెనీల చట్టం ప్రకారం.. ఏ భారత పౌరుడైనా వయస్సుతో సంబంధం లేకుండా, లిస్టెడ్ కంపెనీలలో షేర్లు కలిగి ఉండటానికి అనుమతి ఉంది. కావున, మీరు మీ పిల్లల పేరుపై ఎలాంటి సందేహాలు లేకుండా చట్టబద్ధంగా డీమ్యాట్ ఖాతా తెరవచ్చు.

అవసరమైన పత్రాలు

  • తల్లిదండ్రులు/సంరక్షకుల పాన్ కార్డు
  • తల్లిదండ్రులు/సంరక్షకులు, మైనర్ చిరునామా రుజువు: ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లేదా మరేదైనా. 
  • తల్లిదండ్రులు మరియు మైనర్ పాస్‌పోర్ట్ ఫోటోలు
  • మైనర్ జనన ధృవీకరణ పత్రం
  • తల్లిదండ్రులు/సంరక్షకుల బ్యాంక్ ఖాతా వివరాలు

ఖాతా ఎలా తెరవాలి..?

మైనర్ డీమ్యాట్ ఖాతా తెరవడానికి కనీస వయస్సు అవసరం లేదు. చిన్న పిల్లల పేరుపై కూడా తెరవచ్చు. అయితే, మైనర్‌కు 18 ఏళ్లు వచ్చే వరకు ఖాతాను సంరక్షకుల అధీనంలో ఉండాలి. షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించి అన్నింటికీ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులే బాధ్యత వహించాలి.

  • మొదట ఖాతా తెరవబడే డిపాజిటరీ పార్టిసిపెంట్ (DP)ని ఎంచుకోండి. అది డిపాజిటర్- పెట్టుబడిదారు మధ్య మధ్యవర్తిగా పని చేస్తుంది.
  • తల్లిదండ్రులు మరియు మైనర్ ఇద్దరి సరైన KYC వివరాలతో ఖాతా ప్రారంభ ఫారమ్‌ పూరించండి.
  • అనంతరం తల్లిదండ్రులు మరియు మైనర్ పాస్‌పోర్ట్ ఫోటోలతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించండి.
  • ఆపై ధృవీకరణ పూర్తయ్యాక.. DP క్లయింట్ ఐడీ మరియు ఖాతా సంఖ్యను అందిస్తుంది.

ప్రయోజనాలు

బెటర్ ఫైనాన్షియల్ ప్లానింగ్: ఈక్విటీ స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ తరచుగా ఇతర పెట్టుబడి సాధనాల కంటే మెరుగైన రాబడిని అందిస్తాయి. తల్లిదండ్రులు ఇప్పటినుంచే తమ పిల్లల ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. అందువల్ల, మీ పిల్లల ఉన్నత విద్య, పెళ్లి, ఉద్యోగాల కోసం ఎంతో కొంత మొత్తం ఆదా అవుతుంది.

స్టాక్ మార్కెట్‌పై అవగాహన: మైనర్ డీమ్యాట్ ఖాతా తెరవడం ద్వారా మీ పిల్లలకు స్టాక్ మార్కెట్ పై ఒక అవగాహన వస్తుంది. సరైన వయస్సు వచ్చేసరికి అందులోని మెళుకువలు నేర్చుకుంటారు.