ఈక్విటీ మార్కెట్ల జోష్..పెరుగుతున్న డీమ్యాట్​ ఖాతాలు

ఈక్విటీ మార్కెట్ల జోష్..పెరుగుతున్న డీమ్యాట్​ ఖాతాలు

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్ల నుండి ఆకర్షణీయమైన  రాబడుల కారణంగా డీమ్యాట్​ ఖాతాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లో వీటి సంఖ్య 10.4 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరం అక్టోబరుతో పోలిస్తే ఇది 41 శాతం అధికం. అయితే గత కొన్ని నెలలుగా ఇంక్రిమెంటల్​ యాడిషన్స్ (కొత్త ఖాతాలు)​మాత్రం నెమ్మదిస్తున్నాయి.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్  లెక్కల ప్రకారం, కొత్త డీమ్యాట్​ ఖాతాలు ఈ ఏడాది ఆగస్టు నుండి నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. ఈ ఆగస్టులో వీటి సంఖ్య 26 లక్షలు కాగా, సెప్టెంబర్‌‌లో 20 లక్షలకు పడిపోయాయి. ఇదే ఏడాది  అక్టోబర్  నాటికి 18 లక్షలకు తగ్గాయి.  2021 అక్టోబరులో ఇవి 36 లక్షలు పెరిగాయి.

కొత్త డీమ్యాట్ ఖాతాలు తగ్గుముఖం పట్టడానికి మార్కెట్లో ఆటోపోట్లు,  ప్రపంచ మార్కెట్లు మాంద్యంవైపు పయనించడం, ఇన్​ఫ్లేషన్​ ఇందుకు కారణాలు.  ఫ్రంట్‌‌లైన్ సూచీలతో పోలిస్తే బ్రాడ్​ మార్కెట్ల పనితీరు బాగాలేదని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్‌‌మెంట్ సర్వీసెస్ సీఈఓ రూప్ భూత్రా అన్నారు.  2021తో పోలిస్తే ఈ సంవత్సరం మార్కెట్‌‌లలోకి వచ్చిన  ఐపీఓలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. గత కొన్ని నెలల్లో తక్కువ సంఖ్యలో డీమ్యాట్ ఖాతాలు రావడానికి ఇదీ కారణం.

యుద్ధం, ఇన్​ఫ్లేషన్​ వల్ల...

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రీసెర్చ్-బ్యాంకింగ్ & ఇన్స్యూరెన్స్, ఇన్​స్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ గ్రూప్ వైస్​–ప్రెసిడెంట్​, నితిన్ అగర్వాల్ మాట్లాడుతూ, జనవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మార్కెట్ అస్థిరత పెరగడంతో ఖాతాల సంఖ్య తగ్గడం మొదలయిందని అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇన్​ఫ్లేషన్​,  వడ్డీ రేట్ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇలాంటి అనిశ్చితి కారణంగా, కొత్త వాళ్లు మార్కెట్లలోకి రావడం లేదని వివరించారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో 22 పని దినాలతో పోల్చితే అక్టోబర్ 2022లో  18 పని దినాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రెండు నెలల సంఖ్యలను పోల్చడం సాధ్యం కాకపోవచ్చని స్టాక్​ బ్రోకర్లు అంటున్నారు. మార్కెట్లు బాగుంటాయనే అంచనాల కారణంగా దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్ల వేగం పుంజుకోవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. డీమ్యాట్ ఖాతాల సంఖ్య గత ఏడాది అక్టోబర్‌‌లో 7.4 కోట్ల నుండి 2022 అక్టోబర్‌‌లో 10.4 కోట్లకు పెరిగింది.

డీమ్యాట్ ఖాతాల సంఖ్యలో వార్షిక పెరుగుదలకు మొత్తం కారణాలు స్మార్ట్‌‌ఫోన్ వాడకం ఎక్కువ కావడం, సులభంగా డీమ్యాట్​ ఖాతా తెరిచే వీలు రావడం, గత రెండేళ్లలో ఈక్విటీ మార్కెట్‌‌ల ద్వారా అందించబడిన ఆకర్షణీయమైన రాబడి అని  భూత్రా అన్నారు. నెలవారీ ప్రాతిపదికన, డీమ్యాట్​ ఖాతాల సంఖ్య సెప్టెంబర్‌‌లో 10.3 కోట్ల నుండి అక్టోబరు నెలలో కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. అలాగే, పరిశ్రమ మొత్తానికి యాక్టివ్ యూజర్ క్లయింట్ల సంఖ్య సంవత్సరానికి 30 శాతం పెరిగింది. అయితే నెలవారీగా ఇవి 1.9 శాతం తగ్గి 3.6 కోట్లకు చేరుకున్నాయి. ఇవి వరుసగా నాలుగో నెల కూడా పడ్డాయి.