ప్రాంతీయ పార్టీల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రాంతీయ పార్టీల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రాంతీయ భావాలతో ఏర్పడి, అధికారంలోకి వస్తున్న ప్రాంతీయ పార్టీలు ప్రజలకు మేలు చేయడం మానేసి సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయి. వనరుల దోపిడీకి పాల్పడుతూ కుటుంబ రాజకీయాలను నడుపుతున్నాయి. తామే ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న ఆశతో ప్రతిపక్షాలను అణచివేసే కుట్రల్లో బిజీగా ఉంటున్నాయి. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని దాడులు చేస్తూ ప్రభుత్వమే చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతోంది. ప్రజలకు మంచి చేస్తే అధికారం సొంతమవుతుంది కానీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తే కాదని ప్రాంతీయ పార్టీలు గుర్తించడం లేదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ప్రశ్నించే గొంతును నొక్కేస్తూ ప్రాంతీయ పార్టీలు పాలన చేస్తున్నాయి.

తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా రెండుసార్లు కేసీఆర్‌ కే ప్రజలు పట్టం కట్టారు. ఏదో మంచి చేస్తారని నమ్మి అధికారం ఇస్తే ఎన్నికల్లో ఇచ్చిన
ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చకుండా మోసపు మాటలతో ప్రజల్ని మాయ చేస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తే సీఎం కేసీఆర్ దాన్ని సహించలేకపోతున్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నారు. ఖమ్మంలో మిర్చి రైతులు గిట్టు బాటు ధర కోసం ధర్నా చేస్తే వారికి బేడీలు వేసి జైలులో పెట్టిన ఘనత కేసీఆర్‌‌‌‌కే దక్కుతుంది. నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన లాంటి హామీలపై యువత, విద్యార్థి సంఘాలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడితే లాఠీ చార్జీలు చేయిస్తున్నారు.

నియంతృత్వ ధోరణి వల్లే ప్రజావ్యతిరేకత

తమను ప్రశ్నించేవాళ్లు ఎవరూ ఉండకూడదన్న ఆలోచనతో ప్రదర్శిస్తున్న నియంతృత్వ ధోరణి వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతోందని ప్రాంతీయ పార్టీలు గుర్తించడం లేదు.  2014, 2018లో జరిగిన ఎలక్షన్లలో కేసీఆర్‌‌‌‌కు పట్టంగట్టిన ప్రజల్లో ఇప్పుడు తిరుగుబాటు రావడానికి కారణమిదే. తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం ఇవ్వడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో పెరుగుతోంది. ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షాలను తొక్కిపెడుతున్న తీరు కూడా వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. అందుకే దుబ్బాక బై ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌కు ఎదురుదెబ్బతగిలింది. కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, వాటి వల్ల జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుండడం వల్లే ఆ రెండు ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపారు.

ఏ రాష్ట్రం చూసినా ప్రాంతీయ పార్టీలది అదే తీరు

తెలంగాణ సహా ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రాంతీయ పార్టీల భావజాలం, వాటిని నడిపే వ్యక్తులు వేరు అయినా అవి అనుసరించే పద్ధతులు మాత్రం ఒకలాగే ఉన్నాయి. ఎప్పుడూ తమ స్వార్థం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనే చేయడం లేదు. ఆ పార్టీలను నడిపే నాయకుల మనస్తత్వం ఒక్కటే. నియంతృత్వ ఆలోచనలతో కూడి ప్రజా ఉద్యమాలను అణచివేయడమే వారి టార్గెట్. శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే పోలీసులు లాఠీచార్జ్‌‌ లేదా అరెస్టులు చేయాలి. కానీ పాలకులు తమ స్వార్థం కోసం పోలీసు వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే శాంతియుత నిరసనలను సైతం అణచివేసేందుకు వాడుకుంటున్నారు. ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటకు కనిపించకూడదని ఆరాటపడుతున్నారు. పోలీసులు కూడా కొంతమంది పైరవీలకు అలవాటుపడి మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలు చోటామోటా లీడర్ల వరకూ అందరి మాటలను చట్టంలా భావిస్తూ డ్యూటీలు చేస్తున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్ని చోట్ల సిన్సియర్‌‌‌‌గా డ్యూటీ చేసేవాళ్లను సైతం ఒత్తిడి చేయడం ద్వారా, ట్రాన్స్‌‌ఫర్లు, సస్పెన్షన్లు చేయడం ద్వారా అధికార పార్టీ నేతలు తమ కంట్రోల్‌‌లోకి తెచ్చుకుని ప్రజాగళాన్ని, ప్రతిపక్షాలను అణిచేస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ బలాన్ని ఓర్వలేక దాడులు

దుబ్బాక బై ఎలక్షన్ టైమ్‌‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంటిపై ఆకస్మికంగా దాడి చేసి ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టారు. అంతేకాదు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టారు. ఆ సమయంలో పరామర్శించడానికి వెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన తీరు దారుణంగా ఉంది. అలాగే నల్గొండలో బీజేవైఎం కార్యకర్తలు ప్రైవేట్ టీచర్లకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, వారిని ఆదుకోవాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కార్యకర్తలపై దాడి చేసి వారిని 11 రోజులు జైల్లో పెట్టారు. జనగామ జిల్లాలో వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, కార్యకర్తలు ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసిస్తూ ధర్నా చేస్తే.. వారిపై పోలీసులతో విచక్షణారహితంగా దాడి చేయించారు. దుబ్బాక బై ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలవడం చూసి అధికార పార్టీ ఓర్వలేకపోతోంది. బీజేపీకి ఇలాగే బలం పెరిగితే టీఆర్‌‌ఎస్‌కు భవిష్యత్తు ఉండదన్న భయంతో పోలీసులను అడ్డంపెట్టుకుని బీజేపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్ సర్కారు తీరు ఇలాగే ఉంటే రాబోయే నాగార్జున సాగర్ ఎన్నికల్లోనూ బీజేపీ చేతిలో ఓటమి తప్పదు.

బెంగాల్, మహారాష్ట్రలోనూ సేమ్ టు సేమ్

ఒక్క తెలంగాణలోనే కాదు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోనూ ప్రతిపక్షాలు, ప్రజా ఉద్యమాల అణచివేత సాగుతోంది. బెంగాల్‌‌లో తృణమూల్ చీఫ్, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మంచి పాలన అందించే విషయం మర్చిపోయి బీజేపీ కార్యకర్తలపై అమానుషంగా దాడులు, హత్యలు చేయించడం, పోలీసు కేసులతో వేధించడం లాంటి పనులు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కాన్వాయ్‌‌పై దాడి చేయడం, బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వి సూర్య బెంగాల్‌‌లో ర్యాలీకి పిలుపునిచ్చినప్పుడు బీజేపీ కార్యకర్తలను అడ్డుకొని అరెస్టులు చేసి జైల్లో ఉంచారు. ఇవి చూస్తుంటే బీజేపీ ఎదుగుదల ప్రాంతీయ పార్టీలకు కంటిలో నలుసుగా మారిందనిపిస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా ప్రభుత్వ లోపాలను ప్రశ్నించిన బీజేపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలపై అమానుషంగా దాడులు చేయిస్తున్నారు. ముఖ్యంగా సినీ నటి కంగనా రనౌత్.. సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కక్ష సాధింపుగా ఆమె భవనాన్ని కూల్చివేయడం, అలాగే రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్ణబ్ గోస్వామిని అక్రమ కేసుల్లో అరెస్టు చేశారు. ఈ ప్రాంతీయ పార్టీల వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను రకరకాల కార్యక్రమాలతో, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్న కారణంతోనే ఆయా ప్రభుత్వాలు పోలీసులతో చట్ట వ్యతిరేకంగా కేసులు పెట్టిస్తున్నాయి.

ఓట్ల కోసం విభజన రాజకీయాలు

ప్రాంతీయ పార్టీలు తాము అధికారంలో ఉండడమే లక్ష్యంగా పని చేస్తూ ప్రజల మధ్య విభజన తెచ్చి లబ్ధిపొందాలని చూస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌‌లో రాముడి గుడి కోసం ఇక్కడ చందాలు అడగడమేంటని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరంటారు. హిందూ బొందుగాళ్లు అని కేసీఆర్ అంటారు. ఇవన్నీ ముస్లిం ఓట్ల కోసం టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు కావా? అలాగే ఏపీలో ఆలయాలపై దాడులు చేయించి అక్కడి సీఎం జగన్ క్రిస్టియన్, ముస్లింలను తన ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక బెంగాల్, మహారాష్ట్రలోనూ ఇదే తరహా పరిస్థితి కనిసిస్తోంది.

ఫ్యామిలీ పాలిటిక్స్‌‌

ప్రజల కోసం కాకుండా తమ కుటుంబాల కోసమే పార్టీలు పెట్టారా అన్నట్టుగా ప్రాంతీయ పార్టీ అధినేతల తీరు కనిపిస్తోంది. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ మాటను తుంగలో తొక్కి తానే ఆ పదవిలో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సచివాలయానికి రాకుండా ఫాంహౌస్ పాలిటిక్స్ నడిపారు. కూతురు, కొడుకు, ఇలా ఫ్యామిలీలో అందరికీ పదవులు ఇచ్చుకున్నారు. ఇప్పుడు కొడుకు కేటీఆర్‌‌‌‌ను ముఖ్యమంత్రిని చేసే పనిలో బిజీగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా అనేక కార్యక్రమాల్లో లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్‌‌‌‌కు జైలుకు పోతానన్న భయంపట్టుకుంది. పైగా వచ్చే ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో, బీజేపీ బలపడితే మళ్లీ టీఆర్ఎస్‌కి అధికారం రాదేమో ఈ లోపే కొడుకును ఒకసారి సీఎం చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ పనిని తెలివిగా పార్టీలో వ్యతిరేకత రాకుండా ఉండేలా చేసేందుకు కొందరు మంత్రులు, సీనియర్ నేతలతో కేటీఆర్ సీఎంగా సమర్థుడన్న స్టేట్‌‌మెంట్లు ఇప్పిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పార్టీ అంతా కేటీఆర్‌‌‌‌నే కోరుకుంటోందన్న ఫీలింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అలా కాకుండా ఒకేసారి సీఎంని చేస్తే పార్టీలో బలమైన నేతలు తమ వర్గంతో చీలిక తెస్తారేమో అన్న భయం కేసీఆర్‌‌‌‌లో కనిపిస్తోంది.

  – చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్​ లీడర్​