అభివృద్ధి అంటే తాయిలాలు కాదు: జస్టిస్​ సుదర్శన్ రెడ్డి

అభివృద్ధి అంటే తాయిలాలు కాదు: జస్టిస్​ సుదర్శన్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలో, తాయిలాలో కాదని, కొన్ని వ్యవస్థలు,  కొందరు వ్యక్తుల అభివృద్ధి అంతకన్నా కాదని  సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్​రెడ్డి  పేర్కొన్నారు. అభివృద్ది అంటే మానవాభివృద్ధి అని,  ఆదేశిక సూత్రాల్లో ఉన్న సమన్యాయమే సామాజిక న్యాయమన్నారు. రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యం కాదని, దేశంలో ఉన్న వనరులన్నీ ప్రతి పౌరునికి సమానంగా అందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్​) రజతోత్సవ మహాసభల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మహబూబ్ నగర్ డిక్లరేషన్ స్నాతకోత్సవ సదస్సుకు జస్టిస్​సుదర్శన్​రెడ్డి చీఫ్​ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.

 ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని, ప్రభుత్వం ప్రజల ఆస్తికి కేవలం ధర్మకర్తల మండలిగా వ్యవహరించి పాలన సాగించాలని సూచించారు.  రాష్ర్టంలో 20 రోజుల్లో ప్రజల విశ్వరూపం చూడబోతున్నామని జస్టిస్​సుదర్శన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. డీటీఎఫ్ మహాసభల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు, సామాజిక శాస్ర్తవేత్త ప్రోఫెసర్ హరగోపాల్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి, డిటిఎఫ్ రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి, వామన్ కుమార్, ఎం.శేఖర్ రెడ్డి, కెసి వెంకటేశ్వర్లు, ఆదిత్య, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, రామకృష్ణ   పాల్గొన్నారు.