సంఘ్ ప్రతిపనిలో నేషన్ ఫస్ట్.. చొరబాటుదారుల కన్నా విభజన కారులతోనే పెను ముప్పు: ప్రధాని మోదీ

సంఘ్ ప్రతిపనిలో నేషన్ ఫస్ట్.. చొరబాటుదారుల కన్నా విభజన కారులతోనే పెను ముప్పు: ప్రధాని మోదీ
  • పేదల జీవితాల్లో మార్పులకు ఆర్​ఎస్​ఎస్​ కృషి
  • నాడు బ్రిటిష్​ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది
  • సంఘ్​ ప్రతి పనిలో నేషన్​ ఫస్ట్​ ఉంటుంది.. ఆర్​ఎస్​ఎస్​ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని వ్యాఖ్యలు
  • భరతమాత ఫొటోతో కూడిన రూ. 100 నాణెం విడుదల

న్యూఢిల్లీ: దేశ భక్తికి, దేశ సేవకు ఆర్​ఎస్​ఎస్​ ప్రతిరూపమని, పర్యాయ పదమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భరతమాత కోసం స్వయం సేవక్​లు చేసిన సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు. నాడు బ్రిటిష్​ విధానాలకు వ్యతిరేకంగా ఆర్​ఎస్​ఎస్​ పోరాటం చేసిందని, స్వాతంత్ర్య సమరయోధులకు ఆశ్రయం ఇచ్చిందని ఆయన తెలిపారు. నేషన్​ ఫస్ట్​ అనేది సంఘ్​ ప్రతి పనిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. 

రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఢిల్లీలోని బీఆర్​ అంబేద్కర్​ ఇంటర్నేషనల్​ సెంటర్​లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘ఆర్​ఎస్​ఎస్​.. నదిలాంటిది. నది తన ప్రవాహంతో చెత్తను ఊడ్చేసి.. బీడు భూముల్లో పచ్చదానాన్ని పెంచుతుంది. ఆర్​ఎస్​ఎస్​ కూడా అంతే! నదీ ప్రవాహంలానే సంఘ్​ సైతం దేశం పచ్చగా, ఐక్యంగా ఉండాలని పనిచేస్తున్నది. ‘దేశమే తనకు ముందు..’ అనే నినాదంతో సాగుతున్నది” అని తెలిపారు. 

సంప్రదాయానికి పునరుజ్జీవం

వందేండ్ల కింద విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్​ ఏర్పడటం యాదృశ్చికం కాదని, వేల ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి పునరుజ్జీవమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ సేవ కోసమే నాడు సంఘ్​ ఏర్పడిందని తెలిపారు. బ్రిటిష్​ పాలకుల తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని చెప్పారు. ‘‘దేశంపై కుట్రలు జరిగిన ప్రతిసారి ఆర్ఎస్ఎస్​ ముందుండి పోరాడింది. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశంలోని అణువణువుకు సంఘ్​వ్యాప్తి చెందింది. 

పేదల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చింది. ఎమర్జెన్సీ టైమ్​లోనూ నిషేధాన్ని ఎదిరించి, దేశం కోసం పనిచేసిన గొప్ప సంస్థ ఆర్​ఎస్​ఎస్. నాడు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మాధవ్​ గోల్వాల్కర్​ను కూడా తప్పుడు కేసులతో జైలుకు పంపారు. ప్రతి స్వయం సేవక్​లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలపై ఎంతో విశ్వాసం ఉంటుంది. 

సవాళ్లను ఎదుర్కొనే శక్తి వాళ్లలో పుష్కలంగా ఉంటుంది. స్వాతంత్ర్యానంతరం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సంఘ్​ దృఢంగా నిలబడింది. కుట్రలను ఛేదించి భరతమాత సేవలో నిమగ్నమైంది. దేశభక్తికి, దేశ సేవకు పర్యాయపదంగా ఆర్​ఎస్​ఎస్​ ఉద్భవించింది. ఇప్పటికీ అదే పంథాలో నడుస్తున్నది”  అని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ

ఢిల్లీలోని అంబేద్కర్​ ఇంటర్నేషనల్​ సెంటర్​లో బుధవారం జరిగిన ఆర్​ఎస్​ఎస్​శతాబ్ది ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్​ఎస్​ఎస్​ జనరల్​ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే, ఢిల్లీ సీఎం రేఖాగుప్తా, కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ తదితరులు పాల్గొన్నారు. 

కాగా, సభలో దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతోనే ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్​ఎస్​ఎస్​ ఎదిగిందని, దేశం కోసమే ప్రతి స్వయం సేవక్​ పనిచేస్తుంటారని చెప్పారు.

విభజనకారులతో జాగ్రత్త

దేశానికి చొరబాటుదారుల కన్నా విభజనకారులతోనే పెను ప్రమాదమని మోదీ హెచ్చరించారు. విభజనకా రులు ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల మధ్య చిచ్చుపెట్టి దేశ ఐక్యతను దెబ్బతీయాలనుకుంటారని తెలిపారు. ‘‘కొందరు ప్రజల్లో చొరబడి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తుంటరు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. 

ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చొరబాట్లకన్నా సమాజంలో విభజన తీసుకురావాలనే మనస్తత్వమే చాలా డేంజర్. కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట జరిగే కుట్రలను ఛేదించాలి. సంఘ్​ మాదిరిగా ఐక్యంగా దేశం కోసం ముందుకు సాగాలి. దేశమంతా ఒక్కటేనని నినదించాలి” అని ఆయన పేర్కొన్నారు.

భరత మాత ఫొటోతో రూ. 100 కాయిన్​

ఆర్​ఎస్​ఎస్​ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కాయిన్​, పోస్టల్​ స్టాంప్​ను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఓవైపు జాతీయ చిహ్నం, మరోవైపు భరత మాత ముందు స్వయం సేవక్​లు నమస్కరిస్తున్నట్లు కనిపిస్తుంది. ‘‘స్వతంత్ర భారతదేశ చరిత్రలో భరతమాత చిత్రం కరెన్సీపై చిత్రించడం ఇదే మొదటిసారి. ఇది చరిత్రాత్మకం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.