ఉస్మానియా హాస్పిటల్‌‌ బిల్డింగ్‌‌లన్నీ కూల్చేస్తాం.. కొత్తవి కడతాం.. రాష్ట్ర సర్కార్

ఉస్మానియా హాస్పిటల్‌‌ బిల్డింగ్‌‌లన్నీ కూల్చేస్తాం.. కొత్తవి కడతాం.. రాష్ట్ర సర్కార్

వాటి స్థానంలో కొత్తవి కడతాం  హైకోర్టులో రాష్ట్ర సర్కార్‌‌‌‌ అఫిడవిట్ దాఖలు
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్‌‌ పాత బిల్డింగ్ సహా ప్రస్తుతం అక్కడున్న అన్ని భవనాలను కూల్చి వేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు హైకోర్టులో గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. మెడికల్‌‌ అవసరాలకు అనుగుణంగా కొత్త బిల్డింగ్‌‌ను నిర్మించాలంటే, ఇప్పుడున్న భవనాలన్నింటినీ కూలిస్తేనే సాధ్యమవుతుందని పేర్కొంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్న ఎంబీబీఎస్, పీజీ సీట్ల సంఖ్య, నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం 1,812 బెడ్ల దవాఖాన నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం 35.76 లక్షల స్క్వేర్ ఫీట్ల జాగా అవసరం అవుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

ఉస్మానియా హాస్పిటల్‌‌కు మొత్తం 24.41 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 2 ఎకరాల భూమిలో శ్మశానం, పోలీస్ స్టేషన్ తదితర నిర్మాణాలు ఉన్నాయి. వీటిని వదిలేస్తే ఇంకో 22.2 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎన్‌‌ఎంసీ రూల్స్ ప్రకారం దవాఖానా కట్టడానికి ఈ 22 ఎకరాలు సరిపోతాయని, దీంతో అన్ని బిల్డింగులను కూల్చేయాలన్న ప్రతిపాదనను హెల్త్, ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వం ముందుంచారు. ఈ ప్రతిపాదనపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఇటీవల మంత్రి హరీశ్‌‌ రావుతో సమావేశం నిర్వహించగా, ఎంఐఎం సహా అందరూ ఏకాభిప్రాయం తెలిపారని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌‌లో సర్కార్ పేర్కొంది. 

విడతల వారీగా..
ఉస్మానియా హాస్పిటల్‌‌ బిల్డింగులన్నింటినీ ఒకేసారి కూల్చివేస్తే పేషెంట్లతో పాటు ఎంబీబీఎస్‌‌, పీజీ స్టూడెంట్లకు ఇబ్బందులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఒక బిల్డింగ్ తర్వాత మరో బిల్డింగ్ కూలుస్తూ, వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తూ, దశలవారీగా నూతన ఉస్మానియాను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. తొలుత పాత బిల్డింగ్, నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్‌‌ను కూల్చివేసి, వాటి స్థానంలో కొత్తవి కడతామని, ఆ తర్వాత మిగతావి నిర్మిస్తామని తెలిపారు. పేషెంట్ కేర్ సర్వీస్ దెబ్బతినకుండా కింగ్ కోఠిలో ఉన్న డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌ను ఉస్మానియాకు అనుబంధ హాస్పిటల్‌‌గా ఉపయోగించే ప్రతిపాదనను కూడా మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కార్‌‌‌‌కు సమర్పించారు.