మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • చెరువు బఫర్​ జోన్ 8 ఎకరాలు 
  • ఆక్రమించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

దుండిగల్, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మేడ్చల్​మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దామెర చెరువును ఆనుకొని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ ఉంది. సర్వే నంబర్లు 405, 482, 484, 485, 488, 492, 506 పరిధిలో చెరువు విస్తరించి ఉండగా.. 8 ఎకరాల 24 గుంటల బఫర్​ జోన్​ను ఎంఎల్ఆర్ఐటీ కాలేజీ యాజమాన్యం ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించారు. 

అందులో అక్రమంగా రెండు బిల్డింగులు, ఆరు తాత్కాలిక షెడ్లు నిర్మించినట్టు తేల్చారు. వారం కింద మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో కాలేజీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన సమాధానం ఇవ్వకపోడంతో గురువారం తెల్లవారుజామును పోలీస్​ బందోబస్తు​ నడుమ మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. రెండు జేసీబీలు, నాలుగు డ్రిల్లింగ్ మెషిన్లతో మధ్యాహ్నం వరకు కూల్చివేతలు కొనసాగించారు. ఆరు తాత్కాలిక షెడ్లను పూర్తిగా, రెండు బిల్డింగులను రెండో ఫ్లోర్​వరకు కూలగొట్టారు. 

కాలేజీ ఆవరణలో టెన్షన్.. టెన్షన్

బిల్డింగులను కూల్చివేసేందుకు అధికారులు జేసీబీలు, డ్రిల్లింగ్ మెషిన్లతో రాగా కాలేజీ స్టూడెంట్లు, సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు విద్యార్థులను సముదాయించి అక్కడి నుంచి పంపించివేశారు. ఆ తర్వాత కూల్చివేతలు కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అక్కడికి చేరుకున్నారు. 

కోర్టు స్టే ఉండగా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. నోటీసులిచ్చాక ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా కూల్చివేయడం కరెక్ట్​కాదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చట్ట ప్రకారమే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా, సీఎం ఆఫీస్ నుంచే ఈ వ్యవహారం నడుస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఆరోపించారు.