
సికింద్రాబాద్/పద్మారావునగర్, వెలుగు: ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ స్కూల్బిల్డింగ్ను కాంట్రాక్టర్ కూల్చివేయడం వివాదానికి కారణమైంది. క్లాసులు, ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా కూల్చివేతలు చేపట్టడంతో స్టూడెంట్లు చెట్ల కిందకు చేరారు. తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ స్కూల్ వద్ద జరిగింది. సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్ నూతన భవన నిర్మాణానికి ఇటీవల డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ రూ.29.75 కోట్లు మంజూరు చేయించారు.
దీంతో పాత భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించి పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే సదరు కాంట్రాక్టర్ విద్యాశాఖకు గానీ, స్కూల్ అధికారులకు గానీ ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా సెలవు రోజు అయిన ఉగాది రోజు స్కూల్ బిల్డింగ్ కూల్చివేతలు చేపట్టారు. టీచర్లు, స్టూడెంట్లు గురువారం ఉదయం స్కూల్‌కు చేరుకోగా అప్పటికే బిల్డింగ్ పాక్షికంగా కూల్చివేతకు గురై ఉండటంతో షాక్‌కు గురయ్యారు. ల్యాబ్‌లు, గదుల్లోని అల్మారాలు పగులగొట్టారు. వాటిలో ఉన్న రికార్డ్స్ ధ్వంసమమైనట్లు టీచర్లు తెలిపారు.
కూర్చునేందుకు గదులు లేకపోవడంతో సుమారు 500 మంది స్టూడెంట్లు స్కూల్ ఆవరణలోని చెట్ల కిందకు వచ్చి అక్కడే కూర్చున్నారు. ప్రీ-ఫైనల్ఎగ్జామ్స్ ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్లు కూల్చివేతకు గురై కరెంట్ లేని చీకటి గదుల్లోనే ఎగ్జామ్స్ రాశారు. సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్కూల్ సమీపంలోనే ఉన్న డిప్యూటీ స్పీకర్ క్యాంప్ ఆఫీసుకు చేరుకుని ఆందోళన చేశారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తం: డీఈవో
కూల్చివేత విషయం తెలుసుకున్న హైదరాబాద్డీఈవో రోహిణి స్కూల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కూల్చివేసిన గదులను పరిశీలించి స్టూడెంట్లు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా స్టూడెంట్లను పక్కనే ఉన్న ఓయూ మోడల్ స్కూల్‌కు మార్చాలని గతంలోనే నిర్ణయించామని, ఇందుకోసం వైస్చాన్సలర్అనుమతి కోరామని తెలిపారు.
అనుమతులు వచ్చాకే భవనం కూల్చివేతలు చేపట్టాల్సిఉండగా.. కాంట్రాక్టర్ ఇప్పుడే కూల్చివేతలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.