
దేశ భద్రతే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ISRO) పనిచేస్తుందన్నారు చైర్మన్ వి. నారాయణన్. దేశ పౌరుల భద్రత,రక్షణకు10 ఉపగ్రహాలు నిరంతరం నిరంతరం పనిచేస్తున్నాయని అన్నారు.ఉపగ్రహ, డ్రోన్ టెక్నాలజీ పరిజ్ణానం లేకపోతే మనం లక్ష్యాలను చేరుకోలేమని వెల్లడించారు. ఆదివారం (మే11) అగర్తలలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(CAU) 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. శాటిలైట్లు దేశ భద్రతకు కవచంలా పనిచేస్తున్నాయన్నారు.
దేశ భద్రతను కాపాడుకోవాలంటే.. దాదాపు 7వేల కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతాలను నిరంతరం నిఘా ఉంచాలి. లేటెస్ట్ శాటిలైట్, డ్రోన్ సాంకేతిక పరిజ్ణానం లేకపోతే అనేక వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోలేమన్నారు. ఈ పది ఉపగ్రహాలు సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత, సముద్ర జలాల పరిరక్షణ వంటి అంశాలపై నిరంతర సమాచారాన్ని అందిస్తాయని, ఆ సమాచారంతో సత్వర చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్.
భద్రతాపరమైన అంశాలతో పాటు, ఇస్రో ఉపగ్రహాలు వ్యవసాయం, టెలీ-ఎడ్యుకేషన్, టెలీ-మెడిసిన్, వాతావరణ అంచనా, విపత్తుల సమయంలో నష్ట నివారణ వంటి అనేక పౌర సేవల్లోనూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో ఉపగ్రహాలు కీలకం అన్నారు. గతంలో విపత్తుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతే నేడు ఆ పరిస్థితి లేదని నారాయణన్ గుర్తుచేశారు.
అంతరిక్ష రంగంలో భారత్ పలు మైల్ స్టోన్ దాటిందన్నారు. చంద్రయాన్-1 ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్న తొలి దేశంగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను భారత్ విజయవంతంగా ప్రయోగించిందన్నారు. అమెరికాతో కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యాధునిక భూమిని చిత్రీకరించే ఉపగ్రహాన్ని నిర్మిస్తున్నామని..దీనిని భారత్ నుంచే ప్రయోగిస్తారని వెల్లడించారు. ఈ ప్రగతి దేశ భద్రత, పౌర సేవలకు మరింత ఊతమిస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు.