
న్యూఢిల్లీ: కరోనా పేషెంట్స్ కు కొత్త ముప్పు వచ్చి పడింది. డెంగ్యూ, మలేరియా వల్ల మల్టీపుల్ ఇన్ఫెక్షన్స్ తో కరోనా రోగులు సతమతమయ్యే అవకాశం ఉందని పలు కేసులతో తెలుస్తోంది. రెండు వ్యాధులతో పేషెంట్స్ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ సీజన్ లో దోమల బెడదతో డెంగ్యూ, మలేరియాలు విజృంభించడానికి ఆస్కారం ఉంది. మలేరియా, డెంగ్యూ లాంటి లెఫ్టోస్పిరోసిస్ ఇన్ఫెక్షన్స్ తో వ్యాధుల ప్రాబల్యం మరింతగా పెరిగే ప్రమాదం ఉందని తాజా రిపోర్ట్స్ తో తెలుస్తోంది. ఇవి అనేక లక్షణాలను కలిగి ఉంటాయని, కరోనా సింప్టోమేటిక్ తో ఇవి అతి వ్యాప్తి చెందుతాయని రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇంద్రప్రస్థలోని అపోలో ఆస్పత్రిలో 30 ఏళ్ల కరోనా పేషెంట్ కు మలేరియా కూడా రావడంతో అతడు ఆకస్మికంగా చనిపోయాడు.
‘దోమల సంఖ్య తీవ్రంగా ఉన్న చోట డెంగ్యూ, మలేరియా ఒకేసారి విజృంభిస్తాయి. ప్రస్తుతం ప్రోటోకాల్స్ ప్రకారం సదరు పేషెంట్ ను కరోనా పరీక్షలు నిర్వహించాం. వాటిలో పాజిటివ్ గా తేలింది. ఇది పలు సమస్యలకు దారి తీయడంతో అతడు చనిపోయాడు’ అని సదరు ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేశ్ చావ్లా తెలిపారు.ఈ ఘటనను బట్టి కరోనాకు మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు జతయితే పేషెంట్స్ కు ప్రాణాపాయం తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు. ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో కూడా దాదాపుగా ఇలాంటి కేసు నమోదైంది. 14 ఏళ్ల కరోనా పేషెంట్ కు సడెన్ గా ప్లేట్ లెట్ కౌంట్ తగ్గింది. డాక్టర్లు అతడికి డెంగ్యూ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీనికి తగ్గట్లుగా ట్రీట్ మెంట్ అందించడంతో అతడు కోలుకున్నాడని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కరోనా పేషెంట్స్ ఇతర రోగాల బారిన పడకుండా డాక్టర్లు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.