తగ్గుతున్న భూగర్భ జలాలు.. ఎండుతున్న పంటలు

తగ్గుతున్న భూగర్భ జలాలు.. ఎండుతున్న  పంటలు
  • వరుస కరెంట్ కోతలతో అన్నదాత ఉక్కిరిబిక్కిరి

నిర్మల్, వెలుగు: జిల్లాలో యాసంగి పంటలకు నీటి కష్టం ఎదురవుతోంది. కాలువలతో అందే  సాగు నీరు లేకపోవడంతో వ్యవసాయంలో బోర్ల మీదే రైతులు ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో రోజు రోజుకూ పొలాల్లో బోర్ల వాడకం పెరిగి, గ్రౌండ్​ వాటర్​ లెవెల్స్​ తగ్గుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ఆయా గ్రామాల్లో భూ గర్భ జలాలు పడిపోతున్నట్టు అధికారులు గుర్తించారు. ఎండాకాలం రావడంతో పాటు విపరీతమైన కరెంట్​ కోతలు యాసంగి పంటల మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే పొలాల్లోన్ని బోరుబావులు ఎండిపోయే దశకు చేరుకోగా  పంటలకు సరిగ్గా నీరు అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

బోర్లే దిక్కు..

జిల్లా వ్యాప్తంగా 69 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ  వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో బోరు బావుల ద్వారా రైతులు తమ పంటలకు సాగునీరందిస్తు న్నారు. ముఖ్యంగా ఇక్కడి యాసంగి పంటలకు బోరుబావుల నీరే దిక్కు. వీటి ఆధారంగానే పసుపు, మక్కజొన్న కూరగాయల తో పాటు, ఆరుతడి పంటలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటు నీటిమట్టం 12 మీటర్ల లోతుగా ఉందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.గత అక్టోబర్ నుంచి  ఇప్పటివరకు జిల్లాలో పెద్దగా వర్షపాతం నమోదు కాకపోవడమే భూగర్భ జలాల మట్టం పడిపోవడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఏప్రిల్,  మే నెలలో భూగర్భ జలాల మట్టం మరింత గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. సగటున  12 నుంచి 16 మీటర్ల వరకు కొన్ని చోట్ల భూగర్భ జలాల మట్టం పడిపోయిందని అధికారులు వివరిస్తున్నారు.

ఈ మండలాల్లో ..

లోకేశ్వరం మండలం మన్మద్, తానూర్ మండలం ఓసి గ్రామాలలో  గ్రౌండ్​ వాటర్​ లెవల్​12 మీటర్ల లోతులో  ఉంది.  భైంసా మండలం కామోల్, కడెం మండలం చిన్న బెళ్ళాల్ తదితర గ్రామాలలో ఇప్పటికే 16 మీటర్ల లోతులో నీటిమట్టాలు ఉన్నట్లు   అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

కుబీర్ మండలంలో మరింత తీవ్రం..

ముఖ్యంగా కుబీర్ మండలంలో భూగర్భ జలాల పట్టాలు వేగంగా తగ్గుతున్నాయి.  ఇక్కడి బోరు బావుల కింద సాగుచేసుకుంటున్న రైతాంగం ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుత యాసంగి లో శనగ పంటతో పాటు మక్కజొన్న, జొన్న, నువ్వు, పొద్దు తిరుగుడు పంటలను రైతులు బోరు బావుల నీరు ఆధారంతో సాగు చేస్తున్నారు. కుబీర్ తో పాటు దార్ కుబీర్, పార్డి (కే), సోనారి, గోడాపూర్  తదితర  గ్రామాల్లోని  పంట  క్షేత్రాలలో  సుమారు 2 వేల 923 బోర్ బావులున్నట్లు  అధికారులు పేర్కొంటున్నారు. ఈ బోరుబావుల కింద యాసంగి సాగులో భాగంగా 8 వేల 921 ఎకరాల్లో మొక్కజొన్న, 8 వేల 500 ఎకరాల్లో  శనగ, 550 ఎకరాల్లో గోధుమ, 380 ఎకరాల్లో నువ్వు, 280 ఎకరాల్లో  పొద్దుతిరుగుడు, 2 వేల 300 ఎకరాల్లో జొన్న పంటలను సాగు చేస్తున్నారు. చాలా చోట్ల బోరు బావుల్లో  జలం అడుగంటి పోతుండడంతో నీటిని ఎత్తి పోయడం లేదని,  కొన్నిచోట్ల తక్కువ నీరు ఎత్తిపోస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి...

జిల్లాలో  క్రమంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి.  జిల్లాలో సగటు భూగర్భ జల నీటిమట్టం 12 మీటర్లుగా ఉంది. భైంసా డివిజన్ లో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడి కొన్ని గ్రామాలలో 16 మీటర్ల లోతుకు  నీరు  పడిపోయింది.  రాబోయే ఏప్రిల్, మేలో మరింత వేగంగా భూగర్భ నీటిమట్టాలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా బోరుబావులలో  నీరు మరింత కిందకు పడిపోనుంది. తాగునీటికి సైతం ఇబ్బందులు  ఉండొచ్చు.
–శ్రీనివాస్ బాబు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి, నిర్మల్