
- రైలు పట్టాల కింద .. పేదల ప్లాట్లు గల్లంతు!
- ల్యాండ్ ఓనర్ పేరిట కోర్టులో పరిహారం డిపాజిట్
- లేఅవుట్‌కు పర్మిషన్ లేకపోవడమే కారణం
- లబోదిబోమంటున్న కొనుగోలు దారులు
- న్యాయం కోసం కోర్టుకు.
సిద్దిపేట, వెలుగు: రైల్వే పట్టాల కింద పేదలు, మధ్యతరగతి ప్రజల ప్లాట్లు గల్లంతవుతున్నాయి. పదేండ్ల కింద ప్లాట్లు కొన్నా.. లేఅవుట్‌కు పర్మిషన్ లేకపోవడంతో అధికారులు పరిహారం కూడా ఇవ్వడం లేదు. బాధితులకు బదులు ప్లాట్లు అమ్మిన ఓనర్ పేరిట కోర్టులో పరిహారం డిపాజిట్ చేసి పనులు చేస్తున్నారు. ఓనర్‌కు ఇచ్చిన పరిహారాన్ని ప్లాట్ల యజమానులకు పంచినా రూ.15 వేలకు మించి రాకపోవడంతో న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం ప్లాట్లు కొన్నామని పరిహారమన్నా ఇవ్వాలని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తున్నారు.
8.27 ఎకరాల్లో..
సిద్దిపేట పట్టణ శివారు నర్సాపూర్ సమీపంలోని, గుండ్ల చెరువు వెనకవైపు 599, 600, 601, 602, 603/AA, 603 A1, 603 A2, 614 సర్వే నెంబర్లలో 8 .27 ఎకరాల్లో శ్రీనిధి, శివపురి రియల్ ఎస్టేట్ యజమానులు వెంచర్ చేశారు. నెలవారీగా చెల్లింపులతో దాదాపు 500పై చిలుకు ఓపెన్ ప్లాట్ల అమ్మకానికి ప్రకటనలిచ్చారు. తక్కువ ధరే కావడంతో పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ప్రతి నెలా రూ. 2500, సంస్థ రూల్స్ మేరకు ఇతర ఖర్చులు చెల్లించి 150 గజాల ప్లాట్లను కొన్నారు. చెల్లింపులు పూర్తయిన తర్వాత వెంచర్ నిర్వాహకులు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.
వంద ప్లాట్లలో నుంచి రైల్వేలైన్
మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపూర్ వద్ద రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించారు. పేదలు కొన్న దాదాపు వంద ప్లాట్ల గుండా రైల్వేలైన్ వెళ్లేలా అధికారులు అలైన్మెంట్‌ను ఖరారు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు తమకు ప్లాట్లను అమ్మిన వ్యక్తి వద్దకు వెళ్లి న్యాయం చేయాలని కోరగా ఆయన వీళ్ల పక్షాన కోర్టులో కేసు వేశారు. కేసు నడుస్తుండగానే రెవెన్యూ అధికారులు డిక్రీపాస్ పాస్ చేసి పరిహారం డబ్బులను కోర్టులో డిపాజిట్ చేసి పనులను నిర్వహిస్తున్నారు.
ఎకరాకు రూ.18 లక్షలు
లే అవుట్లకు అనుమతి లేకపోవడంతోనే ప్లాట్లు కొన్న వారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికారులు ప్లాట్ల యజమానులకు బదులు ల్యాండ్ ఓనర్‌కు నోటీసులు ఇచ్చి డిక్రీ పాస్ చేశారు. ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేశారు. ఈ లెక్కన ప్లాట్‌కు రూ.15 వేల పరిహారం కూడా అందే పరిస్థితి లేకుండా పోయింది. కాగా, సిద్దిపేటలో ఉంటున్న కొందరు ప్లాట్ల ఓనర్లు రైల్వే లైన్ నిర్మాణం తెలుసుకుని ముందుగానే వెంచర్ ఓనర్‌తో సెటిల్‌మెంట్ చేసున్నట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో ఉండే దాదాపు వందమంది ప్లాట్ల ఓనర్లు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
పర్మిషన్ లేదంటున్రు
సిద్దిపేట పట్టణ శివారులోని 588 సర్వే నెంబర్లలో 150 గజాల ఫ్లాటును పదేండ్ల కింద నెలావారీ కిస్తీలు చెల్లించి కొన్న. ఇప్పుడు నా ఫ్లాట్ గుండా రైల్వే లైన్ పనులు నడుస్తున్నయి. అధికారులు ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వలేదు. ఏంటని ప్రశ్నిస్తే లే అవుట్ కు అనుమతి లేదని అంటున్నరు.
- ఏలా కొమురయ్య, బేగంపేట
బిడ్డ పెండ్లి కోసం ప్లాట్ కొన్న
రూపాయి రూపాయి కూడబెట్టి బిడ్డ పెండ్లి కోసం సర్వే నెంబర్ 599లో 150 గజాలు ప్లాట్ కొన్న. ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా ప్లాట్ల నుంచి రైల్వే లైన్ పనులు చేస్తున్నరు. అధికారులు, ప్రజా ప్రతినిధులను అడిగితే తెల్వదని అంటున్రు. సర్కారు న్యాయం చేయాలి.
- కట్టోజు భానుప్రియ, లింగారెడ్డిపల్లి
కోర్టులో డిపాజిట్ చేసినం
రైల్వే లైన్ పనులు జరుగుతున్న స్థలంలో ఏర్పాటు చేసిన వెంచర్‌కు అనుమతి లేదు. భూ యజమాని కోర్టులో కేసు వేసినందున ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి పనులను చేస్తున్నం. పేదలు నష్టపోతున్న విషయంపై పైఅధికారులతో మాట్లాడుతం.
- అనంతరెడ్డి, ఆర్డీవో, సిద్దిపేట