సుంకిశాల పాపం బీఆర్ఎస్దే: డిప్యూటీ సీఎం భట్టి

సుంకిశాల పాపం బీఆర్ఎస్దే: డిప్యూటీ సీఎం భట్టి
  • వాళ్ల హయాంలోనే పంప్ హౌస్ నిర్మాణం
  • గోదావరిని కాదు కృష్ణానదినీ వాళ్లు వదల్లేదు
  • డిజైన్ లోపం వల్లే రిటైనింగ్ వాల్ కూలింది
  • ఆ తప్పును మాపై రుద్దే ప్రయత్నం చేస్తుండ్రు
  • సమగ్ర విచారణ చేయించి చర్యలు తీసుకుంటం
  • విద్యుత్ సరఫరాలో ఇబ్బందైతే 1912కి కాల్ చేయండి
  • నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించాం
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల పంప్ హౌస్ నిర్మాణం జరిగిందని, డిజైన్ లోపం వల్లే ఇవాళ కూలిపోయిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం గోదావరి నదినే కాదు కృష్ణను వదల్లేదని అన్నారు. వాళ్లు చేసిన తప్పును తమ ప్రభుత్వంపై రుద్దే  ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలడంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2021లో సుంకిశాలకు శంకుస్థాపనలు చేసిన బీఆర్ఎస్ సర్కారు.. 2023 జులై లో పనులు ప్రారంభించిందని చెప్పారు.

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డతోపాటు సుంకిశాల పాపం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని డిప్యూటీ సీఎం అన్నారు. ఆ పాపాలను భరించలేకే ప్రజలు బీఆర్ఎస్  సర్కారును ఇంటికి పంపారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. సుంకిశాల ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి చెప్పారు. 

హైదరాబాద్ పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. సరఫరాలో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్​ ఫ్రీ  నంబర్ 1912కు కాల్ చేయాలని సూచించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని అంతర్గత బదిలీలు, ప్రమోషన్లకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు భట్టి చెప్పారు.