కాంగ్రెస్​ కట్టిన ప్రాజెక్టులే దిక్కయినయ్ : భట్టి విక్రమార్క

కాంగ్రెస్​ కట్టిన ప్రాజెక్టులే దిక్కయినయ్ : భట్టి విక్రమార్క
  • కృష్ణా జలాల్లో వాటా కోసం పోరాడుతాం
  • రాయలసీమ లిఫ్ట్​​ఇరిగేషన్​ ద్వారా నీళ్లు తరలించుకుపోతుంటే 
  • బేసిన్లు లేవు.. బేషజాలు లేవంటావా.. 
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జడ్చర్ల టౌన్, వెలుగు: నీళ్లు, నిధుల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణను రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. తొమ్మిదేండ్లలో పాలమూరు లిఫ్ట్​​ద్వారా 10లక్షల ఎకరాలకు నీరు పారిస్తామన్న మాజీ సీఎం కేసీఆర్​ పాలమూరు జిల్లాలో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞం పనులనే పూర్తి చేయలేదన్నారు. శనివారం జడ్చర్లలోని నేతాజీ చౌరస్తా వద్ద సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వనితుడు వంశీచంద్​రెడ్డి చేపట్టిన న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగు నీరు పారించి జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్​ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్​ పార్టీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే దిక్కయ్యాయన్నారు. పాలమూరు లిఫ్ట్​​పేరుతో రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరాకు కూడా నీరందించని కేసీఆర్, ఏపీ సర్కారు రాయలసీమ పేరుతో సంఘమేశ్వరం ద్వారా నీటిని తరలించుకుపోతుంటే అడ్డుకోకుండా, బేసిన్లు లేవు.. భేషజాలు లేవంటూ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. 

జడ్చర్ల నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్​ పార్టీకి దూరంగా ఉందన్నారు. 1978లో నర్సప్ప, 1989లో సుధాకర్​ రెడ్డి,2008 ఉప ఎన్నికలో మల్లు రవి గెలవగా, మళ్లీ ఇన్నేండ్లకు అనిరుధ్​ రెడ్డి గెలిచాడన్నారు. దీంతో అబివృద్ధిలో జడ్చర్ల నియోజకవర్గం వెనకబడిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం జడ్చర్లకు వచ్చిన రాహుల్​గాంధీ తన మనసులో మాటను, చారిత్రాత్మక నిర్ణయాన్ని చెప్పారన్నారు. దేశంలో సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్తందని, అలా కాకుండా  బలహీనవర్గాలకు ఆ సంపద అందాలంటే కులగణన జరగాలని, తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 

ఇందులోభాగంగానే శనివారం కులగణన బిల్లుకు ఆమోదం తెలిపామని చెప్పారు. 2014 నుంచి డిండి, పీఎల్ఐ, నారాయణపేట–కొడంగల్​ గురించి గొంతు చించుకున్నా పట్టించుకోలేదన్నారు. జలయజ్ఞం పనులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. కృష్ణా నదిలో నీటి వాటా తేలేంత వరకు పోరాడతామన్నారు. కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో అప్పగించమన్నారు. ధరణిలో జరగిన అవకతవకలను గుర్తించి  సరి చేయడానికి కమిటీ వేశామన్నారు. 

త్వరలోనే భూములు కోల్పోయిన బాధితులకు అప్పగిస్తామన్నారు. వంశీచంద్​రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం కాగానే జీవో నెంబర్  14 ద్వారా నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టును సాధించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి మాట్లాడుతూ 14 ఏండ్లు జడ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన లక్ష్మారెడ్డి అసెంబ్లీలో ఏనాడూ సమస్యలు ప్రస్తావించలేదని విమర్శించారు