- ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ప్రాజెక్టులు పూర్తి చేస్తం
- గిరిజనేతరులకూ పోడు పట్టాలు ఇస్తం
- ఇచ్చిన మాట ప్రకారం ధరణిని
- బంగాళాఖాతంలో వేశామని వెల్లడి
ఆదిలాబాద్, వెలుగు: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును మళ్లీ చేపడతామని, తుమ్మిడిహెట్టి వద్ద మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీపుల్స్‌మార్చ్ పాదయాత్రను ప్రారంభించిన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం పిప్పిరి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భట్టి మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. ‘‘జిల్లాలోని చిక్మాన్ కుప్టీ, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమ్రంభీమ్ ప్రాజెక్ట్ కెనాల్స్, సుద్దన్న వాగు, గొల్ల వాగు, గడ్డెన్న వాగు తదితర మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు నీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్లో రూ. 400 కోట్లు కేటాయించాం. సదర్మట్, చనాక కొరాట ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన పెనుగంగ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం” అని ఆయన చెప్పారు.
రాళ్ల వాగు బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న మంచిర్యాల పట్టణానికి రక్షణ కల్పిస్తూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
త్వరలోనే కొత్త భూచట్టం..
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాట ప్రకారం.. దాని ప్రక్షాళన ప్రారంభించామని భట్టి తెలిపారు. ‘‘ధరణిపై సబ్‌కమిటీ వేశాం. ఆ కమిటీ అధ్యయనం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. అందరి ఆమోదంతో సమగ్ర భూచట్టం తెస్తాం” అని చెప్పారు. ‘‘నేను పాదయాత్ర చేసిన టైమ్ లో బూసిమెట్టకు చెందిన ఆదివాసీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను బీఆర్ఎస్లాక్కున్నదని నా దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేసి, వారికి హక్కులు కల్పిస్తామని అప్పుడు మాటిచ్చాను. ఆ మాటను త్వరలోనే నిలబెట్టుకుంటాను. గిరిజనులతో పాటు గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తాం” అని వెల్లడించారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. మొదటి ఏడాదే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్లాన్ చేశాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు.. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష ఇస్తాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని చెప్పారు.
పీపుల్స్ మార్చ్ చరిత్రాత్మకం..
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చరిత్రాత్మకమైనదని భట్టి అన్నారు. ‘‘2023 మార్చి 16న పిప్పిరి నుంచి మొదలైన పాదయాత్ర జులై 2 వరకు వెయ్యి గ్రామాల మీదుగా సాగింది. ఎండకు ఎండినా, వానకు తడిసినా ఎక్కడా యాత్రను ఆపలేదు. ఇందుకు పిప్పిరి గ్రామస్తుల దీవెనలే కారణం. పాదయాత్రలో ఆదిలాబాద్ ప్రజల గుండె చప్పుడు విన్నా.. కొండల్లో, గూడేల్లో, గుడిసెల్లో, ఎండిన భూముల్లో తిరిగి.. ప్రజల సమస్యలు తెలుసుకున్నా.. ఇందిరమ్మ రాజ్యం తేవాలని కంకణం కట్టుకుని ప్రజాప్రభుత్వం తీసుకొచ్చాం’’ అని అన్నారు.
ఆరోగ్యం బాగా లేకున్నా గద్దర్ తనతో పాటే పాదయాత్ర చేసి తనను ఆశీర్వదించారని భట్టి గుర్తు చేసుకున్నారు. గద్దర్ మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనా విధానాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. కాగా, పిప్పిరి గ్రామాన్ని భట్టి దత్తత తీసుకున్నారు. పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ. 45 కోట్లు మంజూరు చేశారు. బుగ్గారం, తేజ్‌పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
