డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: భట్టి

డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం: భట్టి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయొచ్చని అన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లో టీఎస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

డ్రగ్స్‌‌‌‌ కారణంగా కుటుంబాలు, సమాజం నాశనం అవుతున్నాయన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌‌‌‌ నిర్మూలన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎస్ శాంతికుమారి అన్నారు. డ్రగ్స్ బానిసలను కౌన్సిలింగ్ ద్వారా వాటి నుంచి విముక్తి చేయవచ్చని తెలిపారు. డ్రగ్స్ కట్టడికి పోలీస్ డిపార్ట్​మెంట్ అన్ని చర్యలు తీసుకుంటున్నదని డీజీపీ రవిగుప్తా తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో డ్రగ్స్ రవాణాను అడ్డుకుంటున్నట్టు చెప్పారు. 

సప్లయర్స్​పైనా నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్ కస్టమర్లు అంటేనే డ్రగ్స్ సప్లయర్లు భయపడుతున్నారని సిటీ సీపీ శ్రీనివాస రెడ్డి అన్నారు. స్కూల్స్, కాలేజీల్లో ‘అభయ’ పేరుతో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యాంటీ డ్రగ్స్ డే ర్యాలీలో వివిధ కాలేజీలకు చెందిన స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించేలా రూపొందించిన ‘రామసక్కని కొడుకా’ ఆడియో సీడీని భట్టి ఆవిష్కరించారు. అదేవిధంగా డ్రగ్స్‌‌‌‌కు వ్యతిరేకంగా నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌‌‌‌లో విజేతలకు బహుమతులు అందజేశారు.