- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. శనివారం ఖమ్మం జిల్లా వైరాలో సుమారు 20 ఎకరాల స్థలంలో రూ.200 కోట్లతో చేపట్టే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు, వివిధ మండలాల్లో రూ.18.46 కోట్లతో చేపట్టిన ఏడు విద్యుత్ సబ్ స్టేషన్ల పనులకు, రూ.58.50 కోట్లతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. 2047 కల్లా తెలంగాణ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి వెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న యంగ్ ఇండియా స్కూళ్లు దేశంలో మరెక్కడా లేవన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ విద్యారంగాన్ని విస్మరిస్తే, తాము స్పెషల్ ఫోకస్ పెట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేశామన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి..
తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే కోటి మంది మహిళలకు ప్రతి ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.27 వేల కోట్ల రుణాలు ఇచ్చామని, రెండు మూడు రోజుల్లో మరో దఫా వడ్డీ లేని రుణాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు.
అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. 1456 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.153 కోట్ల 60 లక్షల బ్యాంకు లింకేజీ రుణాల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ కర్నాటి వరుణ్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్త కళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ బొర్రా రాజశేఖర్ పాల్గొన్నారు.
