ఏపీహెచ్ఎంఈఎల్ను అభివృద్ధి చేస్తం..ప్రపంచ స్థాయికి చేర్చేందుకు చర్యలు: భట్టి విక్రమార్క

ఏపీహెచ్ఎంఈఎల్ను అభివృద్ధి చేస్తం..ప్రపంచ స్థాయికి చేర్చేందుకు చర్యలు: భట్టి విక్రమార్క
  • ఏపీ ఇబ్రహీంపట్నంలోని సంస్థను సందర్శించిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషీనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏపీహెచ్​ఎంఈఎల్​)సంస్థను ప్రపంచ స్థాయి పోటీకి తగ్గట్టుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్​ఎంఈఎల్ ను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో సమావేశమయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీహెచ్ఎంఈఎల్ లో అత్యాధునిక మెషీనరీ, స్కిల్డ్​వర్కర్స్​ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోని ఇతర ఇంజనీరింగ్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని సామర్థ్యం ఇక్కడ ఉందన్నారు. ‘‘కార్మికులు, అధికారుల్లో నిబద్ధత, ప్రపంచంతో పోటీపడగల సంకల్పం, వనరుల సమర్థ వినియోగంతో సంస్థ ప్రపంచ స్థాయిలో రాణిస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీహెచ్ఎంఈఎల్ అభివృద్ధికి సమగ్ర వ్యూహం రూపొందించేందుకు త్వరలో ఒక కన్సల్టెన్సీని నియమిస్తామని చెప్పారు.

ఏపీహెచ్​ఎంఈఎల్ ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌‌కు కొత్త యంత్రాల తయారీ, పాత యంత్రాల రిపేర్​తో పాటు, దేశవ్యాప్తంగా ఆర్డర్లను స్వీకరించి బీహెచ్ఈఎల్ తరహా కెపాసిటీ ఉందని భట్టి వెల్లడించారు. థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన యంత్రాల తయారీ, రిపేర్ వంటి కార్యకలాపాల్లో సంస్థ రాణించాలన్నారు. ఫలితంగా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ప్రగతికి దోహదపడగలమని ఆకాంక్షించారు.