ఆగస్టు 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు : భట్టి విక్రమార్క

ఆగస్టు 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు : భట్టి విక్రమార్క
  •     ‘సీతారామ’కు రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరాకూ నీళ్లియ్యలే
  •     ఇరిగేషన్​ మినిస్టర్​ ఉత్తమ్  
  •     రాజీవ్ ​కెనాల్​గా సీతారామ లింక్​​ కెనాల్​  
  •     అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల  
  •     జూలై చివరి నాటికి నీళ్లిస్తాం 
  •     త్వరగా భూసేకరణ పూర్తి చేయాలి
  •      రెవెన్యూ మంత్రి పొంగులేటి 
  •     భద్రాద్రి జిల్లాలో ప్రాజెక్టుల పనులు పరిశీలించిన మంత్రులు

భద్రాద్రికొత్తగూడెం/అశ్వాపురం/ముల్కలపల్లి, వెలుగు :  ఆగస్టు15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.20 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్​, సీతమ్మ సాగర్​ పనులను ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ ​తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. అశ్వాపురం, ములకలపల్లి మండలాల్లో దాదాపు 5 గంటలకు పైగా పర్యటించారు. 

అశ్వాపురం మండలంలోని అమ్మగారిపల్లిలో వ్యూ పాయింట్​నుంచి సీతమ్మ సాగర్​బ్యారెజ్​ను పరిశీలించి తర్వాత ఫొటో ఎగ్జిబిషన్​ను సందర్శించారు. పంప్​హౌజ్–1,2,3 పనులను పర్యవేక్షించి పవర్​సప్లై ప్రారంభించారు. దాదాపు 60 కిలోమీటర్లకు పైగా ఉన్న కెనాల్స్​ను చుట్టివచ్చారు. ముల్కలపల్లి మండలంలోని పంప్​హౌజ్​లో ఇరిగేషన్​ అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రూ.2,600 కోట్లతో పూర్తయ్యే రాజీవ్​సాగర్, ఇందిరాసాగర్​ ప్రాజెక్టులను రీ డిజైన్​ పేరిట దాదాపు రూ. 20వేల కోట్లకు పెంచి ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వని ఘనత బీఆర్ఎస్​ సర్కారుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సీతారామ ప్రాజెక్ట్​ను ఎన్ఎస్​పీఎల్​ కెనాల్​కు లింక్​ చేయడానికి, 9 కిలోమీటర్లు ఉన్న ఎన్కూర్ ​లింక్​ కెనాల్​ను పూర్తి చేసేందుకు రూ. 72కోట్లు మంజూరు చేశామన్నారు. పంపుల ట్రయల్ ​రన్ ​పనులు జరుగుతున్నాయన్నారు. 

అప్పు తెచ్చి కూడా ఏం చేయలే : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

దొరికినంత అప్పు తెచ్చిన బీఆర్ఎస్​ ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి విమర్శించారు. ఆనాటి ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్​లోని హెడ్​వర్క్స్ ​పూర్తి చేయకుండా, ఇష్టమొచ్చినట్టుగా నిధులను ఖర్చు చేసిందన్నారు. పాలేరుకు గోదావరి నీళ్లను ఇచ్చే విధంగా పనులు చేపడ్తున్నామన్నారు. రూ.130 కోట్లు ఖర్చు పెట్టి ఎన్​ఎస్​పీ కెనాల్​కు లింక్​ చేస్తున్నామన్నారు. జూలై చివరి నాటికి వీలున్న మేర నీళ్లిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అప్రోచ్​ కెనాల్​తో పాటు ఇతరత్రా పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఫ్లడ్స్ ​వచ్చిన తర్వాత పనులు చేపట్టలేమన్నారు. భూ సేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. 

రీ సర్వేతో ఎక్కువ ఆయకట్టుకు ప్లాన్​ : తుమ్మల నాగేశ్వరరావు 

రీ సర్వేతో ఎక్కువ ఆయకట్టు వచ్చేలా ప్లాన్ ​చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లాలోని రెండు టన్నెల్​ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాలో 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించడమే తన లక్ష్యమన్నారు. ఇందులో 7 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఉంటుందన్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రగళ్లపల్లి వద్ద చేపట్టే పనులతో దాదాపు 30వేల ఎకరాలకు సాగు నీరందేలా ప్లాన్​ చేస్తున్నామన్నారు. కొత్తగూడెంకు తక్కువ ఆయకట్టు ఉందని, ఎక్కువ ఆయకట్టుకు నీరందేలా కృషి చేస్తామన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్​తో లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు అన్యాయం చేసిందన్నారు. రోళ్లపాడు ప్రాజెక్ట్​తో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎక్కువ ఆయకట్టుకు నీరందేలా కృషి చేయాలని కోరారు. 

గందరగోళంగా రివ్యూ మీటింగ్​  

మైక్​లు సరిగ్గా పనిచేయకపోవడంతో ఇరిగేషన్ ​ఆఫీసర్లు చెప్తున్నది సరిగ్గా వినపడక మంత్రులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అసహనం వ్యక్తం చేశారు. ఒక దశలో అగ్రికల్చర్ ​మినిస్టర్​ తుమ్మల నాగేశ్వర రావు స్టేజీ మీద నుంచి దిగి అటూ ఇటూ తిరిగారు. కలెక్టర్ ​ప్రియాంక అల, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్​, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి, రాందాస్​ నాయక్​, పొదెం వీరయ్య, బలరాం నాయక్​, రామసహాయం రఘురాంరెడ్డి పాల్గొన్నారు.  

రాజీవ్​ కెనాల్​గా ఎన్కూర్​ లింక్​ కెనాల్​ : ఉత్తమ్​ కుమార్​ రెడ్డి 

సీతారామ ప్రాజెక్ట్​లోని ఎన్కూర్​ లింక్​ కెనాల్ ​పేరును రాజీవ్​ కెనాల్​గా మారుస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​కు రూ. 94వేల కోట్లు ఖర్చు పెట్టిన గత బీఆర్​ఎస్​ సర్కారు చేసిన గొప్ప పనేం లేదన్నారు. రూ.2,600 కోట్లతో చేపట్టాల్సిన రాజీవ్​సాగర్ ​ప్రాజెక్ట్​ను రూ.20 వేల కోట్లకు పెంచారని, రూ. 8 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ పేర రూ. 27వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిందేమీ లేదన్నారు. సీతమ్మ బ్యారేజ్​ పనులకు సంబంధించి ఎన్​జీటీలో ఉన్న స్టేలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బ్రీచ్ ​పడిన ప్రాంతాల్లోని కెనాల్​కు రిపేర్లు చేయాలని ఇరిగేషన్​ అధికారులను ఆదేశించారు.  

కాళ్లు మొక్కుతా..అడ్డుకోవద్దు : మంత్రి తుమ్మల వేడుకోలు 

తల్లాడ : రైతన్నలూ మీ కాళ్లు మొక్కుతా సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులు అడ్డుకోవద్దంటూ  మంత్రి తుమ్మల రైతులను వేడుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను పరిశీలిస్తుండగా కెనాల్ పరిధిలో భూములు కోల్పోయిన కొందరు రైతులు నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని ఆందోళన చేశారు. దీంతో మంత్రులు స్పందిస్తూ భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. వర్షాకాలంలో పనులు పూర్తయితే కొన్ని వేల మందికి ప్రయోజనం ఉంటుందని, దయచేసి కెనాల్ పనులు అడ్డుకోవద్దని, కాళ్లు మొక్కుతానని తుమ్మల అన్నారు. ఎకరానికి ఎంతిస్తామనేది కలెక్టర్​తో మాట్లాడి రెండు మూడు రోజుల్లో ఫైనల్ చేస్తామన్నారు.