ప్రజలకు మంచి పాలన అందిస్తాం : సీఎం భట్టి విక్రమార్క 

ప్రజలకు మంచి పాలన అందిస్తాం : సీఎం భట్టి విక్రమార్క 
  • 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ముదిగొండ, వెలుగు : ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజలకు మంచిపాలన అందిస్తామని, పూర్తి న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. కట్టకూరు నుంచి సీతారాంపురం వరకు రూ. 2.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, గోకినేపల్లి నుంచి మేడేపల్లి వరకు రూ. 3.75 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు, కట్టకూర్ నుంచి గోకినేపల్లి వరకు రూ. 5.30 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

గోకినేపల్లిలో 58 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనుల్లో అందరినీ భాగస్వాములను చేస్తామని భట్టి అన్నారు. పదేండ్లుగా నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను చేపడతామన్నారు. కాంట్రాక్టర్లు పనుల్లో నాణ్యత పాటించాలని, క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గ్రామస్తులు పరిశీలించాలన్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని భట్టి చెప్పారు.

ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు హామీలు అమలు చేశామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రారంభించినట్టు చెప్పారు. అంగన్వాడీ ఆయాలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులకు కొంతకాలంగా జీతాలు రాలేదని, ఇకపై ప్రతినెలా జీతాలు అందిస్తామన్నారు. పదేండ్లుగా ఎస్​హెచ్​జీలకు వడ్డీ లేని రుణాలివ్వలేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7 నుంచే వడ్డీ లేని రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పారదర్శకంగా, ఎటువంటి లీకులు లేకుండా నియామకాలు చేపడతామన్నారు. ప్రభుత్వం వచ్చిన రెండున్నర నెలల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్​ రూపొందించామన్నారు. దుబారా తగ్గించి, ప్రజలకు అవసరమైన పనులే చేపడతామని తెలిపారు. కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికోసం ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటుచేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి

ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్యామ్ ప్రసాద్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, ఏసీపీ తిరుపతి రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ లు పుష్పలత, వాణిశ్రీ, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, ముదిగొండ ఎంపీపీ హరిప్రసాద్, ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, తహశీల్దార్ రామారావు, జడ్పీటీసీ దుర్గ తదితరులు పాల్గొన్నారు.