తెలంగాణలో వైద్యానికి పెద్ద పీట : మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణలో వైద్యానికి పెద్ద పీట : మల్లు భట్టి విక్రమార్క

ఎర్రుపాలెం, వెలుగు : రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేసామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో రూ.22 కోట్లతో50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ లేని మండలంగా ఎర్రుపాలెం ఉండడంతో ప్రజా ప్రభుత్వం రాగానే ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తానని మభ్యపెట్టి మాయ చేస్తే ప్రజా ప్రభుత్వం రాగానే ప్రతీ నియోజకవర్గంలో ఏటా 3,500ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. అనంతరం కండ్రిక నుంచి పెద్దగోపవరం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీఎంహెచ్​డీఓ కళావతిబాయి, ఆర్డీవో నరసింహారావు, డీపీఓ ఆశలత, కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో మధిరను మోడల్ గా నిలుపుతా..

మధిర :  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గాన్ని మోడల్ గా నిలుపుతానని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.  బోనకల్ మండలంలో  పలు రోడ్డు పనులు, అంగన్​వాడీ, మత్స్య సహకార భవనాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకుసాగుతోందని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ట్రాన్స్​కో ఎస్​ఈ  శ్రీనివాసాచారి, డీఎంహెచ్​ఓ కళావతి బాయి, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు,  పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.