కరువుకు కేసీఆర్​ పాలనే కారణం : మల్లు భట్టి విక్రమార్క

కరువుకు కేసీఆర్​ పాలనే కారణం : మల్లు భట్టి విక్రమార్క

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుత కరువు పరిస్థితులకు మాజీ సీఎం అస్తవ్యస్త పాలనే కారణమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రాజెక్టులోని నీళ్లను సద్వినియోగం చేసుకోకుండా గత బీఆర్ఎస్​ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆనాలోచిత నిర్ణయాల వల్ల రిజర్వాయర్లన్నీ ఎండిపోయాయన్నారు. అయినా ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా మేం చర్యలు తీసుకుంటున్నమని చెప్పారు. 

రెండు, మూడ్రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిపై క్లారిటీ వస్తుందని అన్నారు. గురువారం ఖమ్మంలోని డీసీసీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక ట్రిపుల్​ఆర్, తాడిచర్ల2 మైన్, ఎలివేటెడ్ కారిడార్ అంశాల్లో కేంద్రం నుంచి క్లియరెన్స్​లు తెచ్చామని భట్టి అన్నారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం యాదాద్రి థర్మల్​ప్లాంటుకు ఎన్విరాన్​మెంటల్ క్లియరెన్స్ తీసుకోకపోవడంతో నిర్మాణం లేటు కావడంతోపాటు రూ.10 వేల కోట్ల భారం పెరిగిందని భట్టి ఆరోపించారు. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసి, మత కల్లోలాలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో మూడు నెలల్లో రాష్ట్రంలో 30వేల ఉద్యోగాలు కల్పించామని. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే  దేశంలో ఇటువంటి పరిపాలన సాధ్యమన్నారు.  తుక్కుగూడ సభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.