
- శుభవార్త వింటారని పాల్వంచ పర్యటనలో డిప్యూటీ సీఎం హామీ
- జిల్లాలో నీరు, బొగ్గు, ట్రాన్స్‌పోర్టు, ల్యాండ్లాంటి వనరులు పుష్కలం
- భట్టి ప్రకటన కోసం జిల్లావాసుల ఎదురుచూపులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పాల్వంచలో 800 మెగా వాట్ల విద్యుత్‌ప్లాంట్ ఏర్పాటు కోసం జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన వనరులు జిల్లాలో పుష్కలంగా ఉండడంతోపాటు ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్వంచలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై త్వరలో శుభవార్త వింటారని చెప్పడంతో స్థానికుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.
ప్లాంట్‌కు వనరులు ఫుల్..
పాల్వంచలో ప్రస్తుతం 5,6 దశల్లో వెయ్యి మెగావాట్లు, ఏడో దశలో 800మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వచ్చే పదేండ్ల కాలంలో 5,6 దశల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు మూసివేయనున్నారు. ఇదే ఆవరణలో కేటీపీఎస్ ఎనిమిదో దశ విద్యుత్ ప్లాంటకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటులో కీలకమైనది భూ సమస్య. భూ సేకరణ, పరిహారం చెల్లించడంతో పాటు ప్లాంట్ నిర్మాణం, గ్రిడ్ లైన్ల ఏర్పాటు, నీళ్ల కోసం కెనాల్స్ తవ్వడానికి రూ. వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
కానీ పాల్వంచలో 800మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్‌కు అవసరమైన భూమికి ఢోకాలేదు. పట్టణంలోని కేటీపీఎస్ లో 720 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను కాలం చెల్లడంతో ఇటీవల కాలంలో కూల్చివేశారు. ఈ స్థానంలో కొత్తగా 800మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. కిన్నెరసాని నీళ్లు ప్లాంట్‌కు సప్లై అవుతున్నాయి. విద్యుత్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును పాల్వంచకు అతి సమీపంలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి బొగ్గు గనుల నుంచి సప్లై చేసే వీలుంది. ఇందుకు అవసరమైన రోడ్డు, రైలు మార్గాలున్నాయి. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను అనుసంధానించేందుకు అతి కీలకమైన గ్రిడ్ లైన్లు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా వచ్చే బూడద కోసం యాష్ పాండ్స్ ఉన్నాయి.
పాల్వంచకు పూర్వ వైభవం వచ్చేనా..?
జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న పాల్వంచ దశాబ్దాల కాలంగా రాష్ట్రానికి వెలుగులను అందిస్తోంది. పాల్వంచలో కాలం చెల్లిన 720 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన పాతప్లాంట్ కేటీపీఎస్ ఓ అండ్ఎంను ఇటీవల అధికారులు తొలగించారు. దీంతో ఈ ప్లాంట్‌లో పనిచేసే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. కుటుంబాలతో సహా బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లడంతో వ్యాపారాలు తగ్గి పాల్వంచ పట్టణం కళ కోల్పోయింది. ఇప్పుడు పాత ప్లాంట్తొలగించిన ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తే పాల్వంచకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయని పట్టణ వాసులు పేర్కొంటున్నారు.
కాగా, ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్వంచలో పర్యటించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారిక ప్రోగ్రాంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్వంచలో 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు విషయమై భట్టి దృష్టికి తీసుకువచ్చారు. అతి తక్కువ ఖర్చుతో 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవచ్చనే విషయాన్ని వివరించారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై సాధ్యా సాధ్యాలపై ఫీజిబిలిటీ నివేదికలను తెప్పించుకుంటానని, త్వరలో శుభవార్త చెప్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. దీని కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.