బుధవారం ( నవంబర్ 26 ) కోనసీమ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొబ్బరి రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొబ్బరి లేనిదే.. భారతీయ సంస్కృతి లేదని.. మన సంస్కృతి సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు పవన్ కళ్యాణ్.కోనసీమ కొబ్బరి రైతుల సమస్యకు 40 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని హామీ ఇచ్చారు.
సంక్రాంతి తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తానని...కోనసీమ పరిధిలో లక్ష ఎకరాల పరిధిలో సాగవుతున్న కొబ్బరి తోటలపై లక్ష కుటుంబాల ఆధారపడి ఉన్నాయని.. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. కోనసీమ రైతాంగానికి గొంతుకనవుతానని.. వారి సమస్యలు పరిష్కరించే గళాన్ని అవుతానని అన్నారు పవన్ కళ్యాణ్.
మాటలు చెప్పి వెళ్లేందుకు రాలేదని.. కోనసీమ కొబ్బరి రైతుకు అండగా ఉన్నామని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు పవన్ కళ్యాణ్. నీటిపారుదల శాఖ నిపుణులు రోశయ్య కోనసీమ కొబ్బరి రైతు సమస్యలపై, ఇక్కడి డెల్టా గురించి రిపోర్ట్ ఇచ్చారని...దాన్ని అధ్యయనం చేసి అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు పవన్.
రెండు వారాల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యపై అధికారులు, రైతులతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అన్నారు.కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్.
