అర్హత ఉన్నా 25,205 మంది రైతులు స్కీంకు దూరం

అర్హత ఉన్నా 25,205 మంది రైతులు స్కీంకు దూరం

ఖమ్మం, వెలుగు: రైతుబీమా దరఖాస్తులకు సోమవారం గడుబు ముగియనుంది. అయితే ఈ స్కీంకు అప్లై చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపించడం లేదు. ఈ స్కీంలో చేరితే రూ.5 లక్షల బీమా వర్తించే అవకాశం ఉన్నా చాలా మంది రైతులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖమ్మం జిల్లాలో అర్హత ఉండి కూడా పోర్టల్ లో నమోదు చేసుకోని రైతులు ఇంకా 25,205 మంది ఉన్నారు. వ్యవసాయ శాఖ ప్రచారం చేయడంలో నిర్లక్ష్యం చూపడం వల్లే రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

అర్హత ఉన్నా అవగాహన లేక.. 

జూన్​ నాటికి 18 ఏండ్లు పూర్తయి, 59 ఏండ్ల వయస్సు మించనివారు, సీసీఎల్​ఏలో నమోదైన వ్యవసాయ పట్టా పాస్​ బుక్​ ఉన్న వారు, ఆర్వోఎఫ్​ఆర్​ పట్టాలు కలిగిన వారు రైతు బీమా స్కీంకు అర్హులు. ఈ ఏడాది కొత్తగా పాస్​బుక్​వచ్చినవారు ఆన్ లైన్​ ద్వారా రైతు బీమా పోర్టల్​లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నమోదు చేసుకున్న వారు ఎవరైనా 59 ఏండ్ల వయస్సు మించితే వారు బీమాకు అర్హత కోల్పోతారు. అలాంటి వారి పేర్లను ఆటోమెటిక్​గా తొలగిస్తారు. అయితే, కొత్తగా అర్హత వచ్చిన రైతుల్లో 16,576 మందిలో 10,387 మంది ఆన్​ లైన్​ లో నమోదు చేసుకున్నారు. ఇంకా 6,189 మంది ఆన్​ లైన్​ చేయాల్సి ఉంది. ఇక మూడు, నాలుగేండ్లుగా బీమా పథకానికి అర్హత కలిగి ఉన్నా కూడా 20,875 మంది ఆన్​లైన్​లో నమోదు చేసుకోలేదు. ఇందులో ఇప్పుడు 1,859 మంది వివరాలు అప్ లోడ్​ చేయగా, 19,016 మంది మాత్రం ఇప్పటికీ అప్లై చేసుకోలేదు. 

జిల్లాలో రైతులు 3లక్షల పైగానే.. 

జిల్లాలో మొత్తం 3లక్షల 22 వేల మంది రైతులున్నారు. ఇందులో 59 ఏండ్లు దాటిన వారు 90 వేల మంది ఉన్నారు. వీరు ఈ స్కీంకు అనర్హులు. మిగిలిన వారిలో 1 లక్షా 92 వేల మంది 
ఇప్పటి వరకు రైతుబీమా పోర్టల్ లో నమోదు చేసుకున్నారు. మిగిలిన వారిలో కొత్తగా అర్హత వయస్సులోకి వచ్చిన వారితో కలుపుకొని 37,451 మంది ఈ ఏడాది ఆన్​లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇందులో శనివారం వరకు 12,246 మంది నమోదు చేసుకున్నారు. ఇంకా 25,205 మంది అప్లై చేసుకోలేదు. రైతు బీమా స్కీం ఇప్పటికే నాలుగేండ్లు పూర్తి చేసుకోగా అర్హులైన చాలా మంది విదేశాల్లో స్థిరపడి ఉండడం, ఆ రైతులను ట్రాక్ చేయలేకపోవడం, ఇక్కడ భూములున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం, వివిద స్థాయిలో పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కావడం వంటి వేర్వేరు కారణాల వల్ల ఈ స్కీంను పట్టించుకోవడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. 

రైతుబీమాపై ప్రచారం చేస్తున్నాం

రైతుబీమాకు సంబంధించి అర్హులైన వారందరూ ఆన్​లైన్​ పోర్టల్​లో నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్నాం. గ్రామాల్లో ఏఈవోల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నాం. విదేశాల్లో ఉన్నవారు, ఇక్కడ భూములున్నా ఆంధ్రాకు చెందిన రైతులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వారు బీమా పోర్టల్ లో నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు.    

 - విజయనిర్మల, డీఏవో, ఖమ్మం