
- జూరాల, శ్రీశైలానికి భారీ వరద వచ్చినా ఎత్తిపోతలు అంతంతే
- లిఫ్టు చేసిన నీళ్లనూ నిల్వ చేసుకోలేని దుస్థితి
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తికాని రిజర్వాయర్లు
- పెండింగ్‌లోనే పాలమూరు- రంగారెడ్డి
- నెట్టెంపాడు, కల్వకుర్తిలోనూ సమస్యలు
- ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో సాగునీటికి తిప్పలు
మహబూబ్‌నగర్, వెలుగు: పక్కనే కృష్ణా నదిలోంచి వందల టీఎంసీల నీరు కిందికి వెళ్తున్నా పాలమూరు పొలాలు మాత్రం తడవడం లేదు. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ఇప్పటివరకు జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లకు 585 టీఎంసీల వరద వచ్చినా ఇందులోంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ లిఫ్ట్ స్కీమ్‌లకు తరలించింది కేవలం 27.3 టీఎంసీలే ! పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ప్రయారిటీ ఇచ్చి ‘పాలమూరు – రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టడం వల్లే ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఉన్న నెట్టెంపాడు, కల్వకుర్తి లాంటి లిఫ్టు స్కీములు సామర్థ్యం మేర పనిచేయకపోవడం, ఎత్తిపోసిన నీటిని నిల్వ చేసేందుకు సరిపడా రిజర్వాయర్లు లేకపోవడంతో ఏటా లక్షల క్యూసెక్కుల వరద వృథాగా కిందికి పోతోంది.
పాలమూరులో రిజర్వాయర్లేవి ?
ఏపీ ప్రభుత్వం హంద్రీ-నీవా, కర్నూల్–-కడప కెనాల్ (కేసీసీ), ఎస్‌ఆర్‌ఎంబీ, తెలుగు గంగ కాలువల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని తరలించుకుపోతోంది. రాయలసీమలోని కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిర్మించుకున్న 50 రిజర్వాయర్లలో 350 టీఎంసీల నుంచి 400 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొని వాడుకుంటోంది. గతంలో అర టీఎంసీ నుంచి రెండు టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లను గడిచిన కొన్నేళ్లలో ఐదు నుంచి పది టీఎంసీలకు విస్తరించుకుంది. కానీ తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రిజర్వాయర్ల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది.
పాలమూరు–-రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా- 1, భీమా-2, కోయిల్‌సాగర్ కింద మొత్తం 22 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ... 11 రిజర్వాయర్లలో మాత్రమే నీటిని నిల్వ చేసుకునే అవకాశముంది. పాలమూరు స్కీమ్ కింద ఉన్న ఆరు రిజర్వాయర్లలో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. నెట్టెంపాడు కింద ఏడు రిజర్వాయర్లు ఉండగా.. సంగాల, చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి, నాగర్‌దొడ్డి, తాటికుంట రిజర్వాయర్లను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో ఉన్న 11 రిజర్వాయర్లలో 18 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు పెండింగ్‌లో ఉండడంతో చెరువులను కూడా నింపే పరిస్థితి లేకుండా పోయింది.
‘కల్వకుర్తి’లో మెయిన్ కెనాల్స్ పెండింగ్
కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్‌లో మెయిన్ కెనాల్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 30వ ప్యాకేజీలో కల్వకుర్తి నుంచి అచ్చంపేట వరకు 40 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వాల్సి ఉండగా... 15 కిలోమీటర్ల పనులు పెండింగ్‌పడ్డాయి. 29వ ప్యాకేజీ కింద కెనాల్ తవ్వకానికి ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ కావాల్సి ఉంది. అలాగే బ్రాంచ్ కెనాల్స్, స్ట్రక్చర్లు, సబ్ కెనాల్స్ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నెట్టెంపాడు పరిధిలో 99వ ప్యాకేజీ కింద ప్రధాన కాల్వ పనులు పూర్తి కాలేదు. రెండేండ్ల కింద బుంగ పడ్డ ర్యాలంపాడు రిజర్వాయర్‌కు ఇప్పటివరకు రిపేర్లు చేయలేదు. ఈ రిజర్వాయర్ కెపాసిటీ నాలుగు టీఎంసీలకు కాగా ప్రస్తుతం రెండు టీఎంసీలనే నిల్వ చేస్తున్నారు. కోయిల్‌సాగర్ లెఫ్ట్ కెనాల్‌ను ఆధునికీకరించకపోగా... కొన్ని చోట్ల లైనింగ్ దెబ్బతింది. కాలువలు, బ్రాంచ్ కెనాల్స్ పూడుకుపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.
కాంగ్రెస్వచ్చాకే ‘పాలమూరు’లో కదలిక..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలమూరు జిల్లాలోని స్కీమ్‌లపై ఫోకస్ పెట్టింది. పెండింగ్‌లో ఉన్న పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘పాలమూరు– -రంగారెడ్డి’ స్కీమ్‌కు ఇటీవల నిధులు కేటాయించడంతో నార్లాపూర్ – -ఏదుల మధ్య ఉన్న కెనాల్ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే నార్లాపూర్ వద్ద ఐదు పంపులను రెడీ చేయగా.. నాలుగింటి ట్రయల్ రన్ పూర్తయ్యింది. ఉదండాపూర్ రిజర్వాయర్‌ను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనుల్లో స్పీడ్ పెంచింది.
జూరాల గేట్లు క్లోజ్
గద్వాల, వెలుగు : కర్నాటక ప్రాజెక్టుల్ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్ట్ గేట్లను క్లోజ్ చేశారు. జూరాలకు మొత్తం 49,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాలలో ప్రస్తుతం 317.980 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం 37,389 క్యూసెక్కులు, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, కోయిల్‌సాగర్‌కు 315, లెఫ్ట్ కెనాల్‌కు 1,080, రైట్ కెనాల్‌కు 690 కలిపి మొత్తం 40,269 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
తొమ్మిదేండ్లలో పాలమూరు - రంగారెడ్డి పనులు 45 శాతమే పూర్తి
పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగు నీరు అందించేందుకు ‘పాలమూరు-– రంగారెడ్డి’ స్కీమ్‌ను 2015లో అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మూడేండ్లలోనే పూర్తి చేస్తామని చెప్పినా.. తర్వాత పట్టించుకోకపోవడంతో 2023 వరకు 45 శాతం పనులే పూర్తయ్యాయి. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు వెళ్లే మెయిన్ కెనాల్ పనులు ఏడు కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఇది పూర్తయితేనే నార్లాపూర్ నుంచి ఏదులకు నీరు చేరుతుంది. అలాగే వట్టెం నుంచి కర్వెన రిజర్వాయర్ కెనాల్ పనులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉదండాపూర్ వరకు నీటిని తీసుకెళ్లేందుకు అండర్ టన్నెల్, కాల్వలు నిర్మించాల్సి ఉండగా.. ఇందుకు హైవేను రెండు చోట్ల, రైల్వే లైన్‌ను రెండు చోట్ల క్రాస్ చేయాల్సి ఉంది. దీంతో ఆ పనులు కూడా ముందుకు పడలేదు. ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు 60 శాతమే పూర్తయ్యాయి. ఇంకా కెనాల్స్, రిజర్వాయర్ కట్ట పనులు చేయాల్సి ఉంది.
పాలమూరు జిల్లాలో అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు, కెపాసిటీ
రిజర్వాయర్ కెపాసిటీ (టీఎంసీల్లో..)
ఎల్లూరు 0.3
సింగోటం 0.5
జొన్నలబొగుడ 2
గుడిపల్లిగట్టు 1
ర్యాలంపాడు 4
గుడ్డెందొడ్డి 1.6
కోయిల్‌సాగర్ 2.24
సంగంబండ 3.37
భూత్పూర్ 1.3
శంకరసముద్రం 1.60
ఏనుకుంట 0.6
జూరాల, శ్రీశైలం కింద వాడుకున్న నీరు
రిజర్వాయర్ వాడిన నీరు (టీఎంసీల్లో...)
జూరాల రైట్ కెనాల్ 1.5
జూరాల లెఫ్ట్ కెనాల్ 2.92
నెట్టెంపాడు 3.3
కోయిల్‌సాగర్ 1.5
భీమా-1 5.8
భీమా-2 2.01
కల్వకుర్తి 10