కర్నాటకలో ఓడినా తెలంగాణలో గెలుద్దాం.. రాష్ట్ర బీజేపీ నేతలకు హై కమాండ్​ దిశానిర్దేశం

కర్నాటకలో ఓడినా తెలంగాణలో గెలుద్దాం.. రాష్ట్ర బీజేపీ నేతలకు హై కమాండ్​ దిశానిర్దేశం
  • కర్నాటకలో ఓడినా తెలంగాణలో గెలుద్దాం

  • రాష్ట్ర బీజేపీ నేతలకు హై కమాండ్​ దిశానిర్దేశం

  • ఓటమి ఎఫెక్ట్​ శ్రేణులపై పడకుండా చర్యలు

  • ఈ నెల చివరి వారం నుంచి జాతీయ నేతల వరుస పర్యటనలు

హైదరాబాద్, వెలుగు : సౌత్ లో కర్నాటకను కోల్పోయినప్పటికీ తెలంగాణలో గెలుపు కోసం బీజేపీ హైకమాండ్  ఫోకస్ పెట్టింది. మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో.. ఇదే అవకాశంగా భావిస్తున్నది. కర్నాటక ఎన్నికల ప్రభావం ఇక్కడి శ్రేణులపై పడకుండా చర్యలు మొదలుపెట్టింది. ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్రంలో పార్టీ జాతీయ నేతలు పర్యటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో కన్నా ఇప్పుడు తెలంగాణలో పార్టీ ప్రోగ్రామ్ లను స్పీడప్ చేయాలనే ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. 

జనంలోకి మరింత వెళ్లేందుకు

తెలంగాణలో బీఆర్ఎస్​కు తామే ప్రత్యామ్నాయమ ని బీజేపీ నేతలు చెప్తున్నారు. మూడేండ్లుగా పార్టీలో చేరికలను స్పీడప్ చేశారు. ఇదే క్రమంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు దక్కాయి. రాష్ట్ర ప్రజలను బీజేపీ వైపు చూస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర నేతలకు హైకమాండ్​ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నది. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా రాష్ట్రంలో  పర్యటించారు.

వరుస కార్యక్రమాలతో పార్టీ కేడర్​లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కర్నాటక ఎన్నికలు కూడా పూర్తవడంతో అక్కడి ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణపై ఫోకస్​ పెట్టాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నది. సౌత్​లో ఇన్నాళ్లూ  కర్నాటకనే బీజేపీకి పెద్ద దిక్కు. ఇప్పుడు అక్కడ ఓడిపోయినప్పటికీ.. తెలంగాణలో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నది.