డిజిటల్​ పేమెంట్స్​లో దూసుకెళ్తున్నం: నిర్మలా సీతారామన్​

డిజిటల్​ పేమెంట్స్​లో దూసుకెళ్తున్నం: నిర్మలా సీతారామన్​
  • ఐఎంఎఫ్​ పేద దేశాలను ఆదుకోవాలి
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​

వాషింగ్టన్​: గ్లోబల్​ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ మనదేశ ఎకానమీ బలహీనపడబోదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ ​రేటు ఏడు శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాలు, విధానాలు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తాయని అన్నారు.

వాషింగ్టన్​లో జరిగిన ఐఎంఎఫ్​ ప్లీనరీ సెషన్​లో మాట్లాడుతూ ఆమె ఈ మాటలు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా సరిహద్దు వ్యాపారాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అన్ని చోట్లా ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మీటింగ్​ జరిగింది. ఇన్​ఫ్లేషన్​ను నియంత్రిస్తూనే మరింత గ్రోత్​ సాధించేందుకు మోడీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ఆమె ఐఎంఎఫ్​ సభ్యులకు వివరించారు.

డిజిటల్​ పేమెంట్స్ విషయంలో ఇండియా ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని చెప్పారు. గ్లోబల్​ ఎకానమీని కాపాడేందుకు పేద, తక్కువ ఆదాయం గల దేశాలకు ఐఎంఎఫ్​ఎక్కువ వనరులు కేటాయించాలన్న వాదనపై స్పందిస్తూ గ్లోబల్ ఎకానమీలో తమ వాటాల ప్రకారం ఎమర్జింగ్​ మార్కెట్​ ఎకానమీల (ఈఎంఈఎస్​) ఓటు హక్కులను పెంచడానికి కోటాల జనరల్​ రివ్యూను వచ్చే డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఇండియా ఓటింగ్​ షేరు 2.75 శాతం ఉండగా, అమెరికా షేరు 17.43 శాతం వరకు ఉంది. తక్కువ ఆదాయం గల  దేశాలు  బకాయిలు సకాలంలో చెల్లించడానికి ఐఎంఎఫ్​ తగిన సాయం చేయాలని నిర్మల కోరారు. 

మన ఎకానమీకి ఢోకా లేదు: ఎస్‌‌‌‌బీఐ చైర్మన్ దినేశ్​ ఖారా

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్​),  ప్రపంచ బ్యాంకు భయపడుతున్నట్టుగా ప్రపంచ మాంద్యం వచ్చినా దాని ప్రభావం ఇండియా ఎకానమీపై పెద్దగా ఉండకపోవచ్చని ఎస్​బీఐ చైర్మన్​ దినేశ్​ ఖారా అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం పరిస్థితి బాగుంటుందని అన్నారు.  అంచనా వేసినట్టుగానే వృద్ధి రేటు 6.8 శాతం సాధ్యమవుతుందని, ఇన్​ఫ్లేషన్​"చాలా వరకు నియంత్రణలో ఉంది" అని చెప్పారు.

భారతదేశం అన్ని విధాలా బాగా పనిచేస్తోందని ఖారా ఐఎంఎఫ్​ వార్షిక సమావేశం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియా జీడీపీకి దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యం కాబట్టి ప్రపంచ మాంద్య ప్రభావం చాలా తక్కువగా ఉండొచ్చని అన్నారు.  కొన్ని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే  భారత ఆర్థిక వ్యవస్థకు రిస్కులు చాలా తక్కువగా ఉంటాయని ఆయన అన్నారు.

రూపాయి గురించి మాట్లాడుతూ డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల దేశ కరెన్సీ తగ్గిందని, అయితే ఇతర వర్ధమాన మార్కెట్ ఎకానమీల కరెన్సీలతో పోలిస్తే మన కరెన్సీ బాగానే ఉందని  దినేష్ ఖరా తెలిపారు. ‘‘రూపాయి విలువ తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా  దిగుమతులు ఎక్కువగా ఉన్న దేశానికి ఇది చాలా నష్టదాయకం”అని పేర్కొన్నారు.

 క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం  డాలర్‌‌తో రూపాయి 82.19 వద్ద ముగిసింది. ఇంటర్‌‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌‌లో రూపాయి 82.26 వద్ద ప్రారంభమైంది.    దీనిపై ఖారా మాట్లాడుతూ ఇండోనేషియా,  బ్రెజిల్.. ఈ రెండు కరెన్సీలు మాత్రమే మన కంటే మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు.   అవసరమైనప్పుడు ఆర్​బీఐ రూపాయి విషయంలో కలగజేసుకుంటుందని అన్నారు.

గీతా గోపీనాథ్‌తో చర్చలు

అమెరికా పర్యటన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐఎంఎఫ్​ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల గురించి,  వచ్చే ఏడాది భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ పదవిని చేపట్టడం గురించి చర్చించారు.  

ఆహారం, ఇంధన భద్రత సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా బకాయిల చెల్లింపులు ఆగిపోవడం, వాతావరణ సమస్యలు, డిజిటల్ అసెట్స్​ సహా  పలు విషయాలను చర్చించారు. భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం సహా సమస్యలపై భారత ఆర్థిక మంత్రితో చాలా మంచి సమావేశం జరిగిందని గీత ట్వీట్ చేశారు. భారతదేశం డిసెంబర్ 1, 2022 నుండి నవంబర్ 30, 2023 వరకు ఒక సంవత్సరం పాటు జీ20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. దేశవ్యాప్తంగా 200  సమావేశాలు నిర్వహిస్తుందని భావిస్తున్నారు.