
- రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడమే కారణం
- పెండింగ్‌లోనే రూ.417 కోట్లు
- రైల్వేకు సహకరించని రాష్ట్ర సర్కారు
సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్లో పేద, మధ్య తరగతి జనాలకు ఎంఎంటీఎస్ సౌకర్యవంతమైన రవాణా సదుపాయాన్ని అందిస్తోంది. మిగతా రవాణా వ్యవస్థలతో పోలిస్తే ఇందులో చార్జీలు చాలా తక్కువ. అందుకే వీటి సేవలను మరింత విస్తరించేలా.. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించింది. రూ.1150 కోట్ల అంచనా వ్యయం ఉన్న ఈ ప్రాజెక్ట్ పనులు రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే ముందుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలంటే రాష్ట్ర సర్కారు తమ వంతు నిధులు కేటాయించాల్సి ఉండగా.. ఆ వాటాను విడుదల చేయడం లేదు. కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి.
రూ.817 కోట్ల అంచనాతో..
గ్రేటర్లో ఎంఎంటీఎస్ ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తయి రైళ్లు పట్టాలెక్కిన తర్వాత జనాల నుంచి వస్తున్న స్పందనను గుర్తించిన కేంద్రంలోని అప్పటి ప్రభుత్వం.. ఈసేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో రూ.817 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్–2 ప్రాజెక్టును 2012–-2013లో మంజూరు చేసింది. ఈ నిధులతో మల్కాజిగిరి, బొల్లారం, మౌలాలి, ఘట్కేసర్, సీతాఫల్మండి, సనత్‌నగర్, తెల్లాపూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో ఎలక్ట్రిఫికేషన్లేన్ల డబ్లింగ్ పనులు చేపట్టాలని ప్రాజెక్టులో నిర్ణయించారు. అయితే మొదట మంజూరైన నిధులతో ఇప్పటివరకు మల్కాజిగిరి–-బొల్లారం మార్గంలో సుమారు 14 కి.మీ. వరకు ట్రాక్‌ల ఎలక్ట్రిఫికేషన్పనులు పూర్తిచేశారు. అలాగే తెల్లాపూర్–రామచంద్రాపురం స్ట్రెచ్‌లో 6 కి.మీ.వరకు, మేడ్చల్–బొల్లారం మధ్య 14 కి.మీ. వరకు, మౌలాలి–-ఘట్కేసర్ మధ్య12.2 కి.మీ. వరకు, ఫలక్‌నుమా-–ఉందా నగర్మధ్య 13.5 కిలో మీటర్ల వరకు ఎలక్ట్రిఫికేషన్ డబ్లింగ్ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం మరో రెండు ప్రాంతాల్లో.. సనత్‌నగర్–మౌలాలి, మౌలాలి-మల్కాజిగిరి–సీతాఫల్మండి స్టేషన్ల మధ్య ఈ పనులు జరుగుతున్నాయి.
ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా..
రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఎంఎంటీఎస్ ఫేజ్–2 పనులు ముందుకు సాగడం లేదు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ పనులు.. రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఇదిలా ఉంటే, రాష్ట్రం ఇప్పటివరకు రూ.279 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.417 కోట్లు చెల్లించాల్సి ఉందని రైల్వే అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌కు కేంద్రం నుంచి నిధులు కేటాయిస్తున్నా.. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్స్వయంగా వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేస్తే ఎంఎంటీఎస్ ఫేజ్–2 పనులు తొందరగా పూర్తయ్యే అవకాశముంది.