పోస్టుల భర్తీకి రెండేండ్లు!

పోస్టుల భర్తీకి రెండేండ్లు!

 

  • రోస్టర్​ తేల్చడం, సిలబస్, నోటిఫికేషన్, ప్రిపరేషన్ కే మస్తు టైం
  • దరఖాస్తు, పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్​, ఇంటర్వ్యూలకు మరింత సమయం పట్టే అవకాశం
  • పోలీస్ రిక్రూట్ మెంట్ లో రాత పరీక్ష, ఈవెంట్స్​కు లాంగ్​ ప్రాసెస్​
  • టెట్ నిర్వహణ, ఫలితాలకు  ఆర్నెల్లు, టీఆర్టీ కి మరో ఆర్నెల్లు
  • గ్రూప్-1, గ్రూప్ -2లో  ప్రిలిమ్స్, మెయిన్స్ కు ఏడాది పట్టే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వచ్చినప్పటికీ.. వాటి భర్తీకి మాత్రం కనీసం రెండేండ్లు టైం పడుతుందని అధికారులు అంటున్నరు. రకరకాల ఉద్యోగాలు ఉన్నందున వాటన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నరు. నోటిఫికేషన్ కంటే ముందు శాఖల వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్​ తయారు చేయడం, పరీక్ష కోసం సిలబస్ రూపొందించడం, ఎలాంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా నోటిఫికేషన్​ను సిద్ధం చేయడానికి మస్తు టైం పడుతుందంటున్నారు. నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తుకు కనీసం నెల నుంచి రెండు నెలల సమయమివ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత ప్రిపరేషన్ కు మూడు, నాలుగు నెలలు, పరీక్ష రాశాక ఫలితాలకు మరో రెండు, మూడు నెలలు, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు నెల రోజులు, ఇంటర్వ్యూకు/ఈవెంట్స్​ కు ఒకటి,  రెండు నెలలు పట్టే అవకాశముంది. ఈ తతంగమంతా వెంటవెంటనే నిర్వహించినా కనీసం ఏడాదిన్నర పడుతుందని, మధ్యలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే మరో ఆర్నెల్లు, ఏడాది పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గతంలో టీఎస్​ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్​–2, గ్రూప్ –4 పోస్టుల భర్తీకి ఐదేండ్లు పట్టగా, టీఆర్టీలో కొన్ని పోస్టుల భర్తీ ఆరేండ్లయినా పూర్తి కాలేదు.

ఉద్యోగాల భర్తీలో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కీలకమైంది. ఆయా డిపార్ట్​మెంట్లలో ఖాళీల వివరాలు ఇచ్చే టైంలో వీటన్నింటిని సిద్ధం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ రిక్రూట్​మెంట్ ఏజెన్సీకి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు పూర్తి చేసినప్పటికీ.. రోస్టర్ పాయింట్లపై అన్ని డిపార్ట్​మెంట్లు కసరత్తు చేస్తున్నాయి. ఆ తరువాత రిక్రూట్ మెంట్ ఏజెన్సీకి అనుమతి ఇస్తారు. ఇక రిక్రూట్​మెంట్ ప్రక్రియ మొదలుపెట్టే ముందుకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిలబస్ ఇంపార్టెంట్. ఇది కంప్లీట్ చేసి భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుందనేది నోటిఫికేషన్ లో క్లియర్​గా చెప్తరు. ఆ తరువాత నిరుద్యోగ యువతలో అర్హులు సంబంధిత సర్కార్ జాబ్ నోటిఫికేషన్​కు అప్లై చేసుకునేందుకు కనీసం 20 రోజుల నుంచి నెల రోజుల టైం ఇస్తరు. ఆ తరువాత జాబ్ నోటిఫికేషన్​ను బట్టి ప్రిపరేషన్​కు రెండు నెలల నుంచి 4 నెలల టైం ఇవ్వాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నరు. ఆ తరువాత రిజల్ట్​కు మరికొంత సమయం తీసుకుంటారు. ఇలా ఒక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే కనీసం 5 నెలలు టైం పడుతుందని పేర్కొంటున్నరు. ఇక కోర్టు కేసులు ఇతరత్రా ఏమైనా ఉంటే చాలా టైం తీసుకుంటుందని అంటున్నరు. గతంలో చాలా జాబ్స్ భర్తీ ఇలాగే జరిగిందంని చెప్తున్నరు. 

గ్రూప్–1 ఒక్కదానికే ఏడాది పడుతది!​

గ్రూప్–1 నోటిఫికేషన్ కంప్లీట్ చేసేందుకు కనీసం ఏడాది టైమ్ పడుతుందని అధికారులు చెప్తున్నరు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆ తరువాత మెయిన్స్ రెండు పరీక్షలు నిర్వహించడం, వాటి రిజల్ట్స్ ఆ తరువాత ఇంటర్వ్యూ వంటివి ఉంటాయని దీంతో ఇలాంటి నోటిఫికేషన్​కు టైం ప్రాసెస్​ ఉంటుందని టీఎస్​పీఎస్సీ ఆఫీసర్ ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. గతంలో గ్రూప్–2 నోటిఫికేషన్​ ఇస్తే కంప్లీట్ చేయడానికి నాలుగేండ్లు టైమ్ పట్టినట్లు వివరించారు. అయితే కొన్ని జాబ్స్​ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ అయిపోతే.. మిగతా వాటికి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు పెద్ద సమస్య ఉండదని పేర్కొన్నారు. హోం.. ఎడ్యుకేషన్ కు ప్రయారిటీ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యేకంగా ఉంది. పోలీసులు జాబ్స్​కు పోటీపడే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. ఇప్పటికే ఎస్​ఐ, కానిస్టేబుల్​ రిక్రూట్మెంట్​కు సంబంధించి అన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 18,334 ఖాళీలు ఉన్నాయి. మొదట పోలీసు శాఖలో నోటిఫికేషన్​ ఇస్తే.. ఆ ప్రాసెస్​ మొదలవుతుందని ఆ తరువాత ఎడ్యుకేషన్​ కోసం ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉండటం ఈ రెండు జాబ్స్ నోటిఫికేషన్స్​కు ప్రిపేర్​ అయ్యేవాళ్లు కూడా సపరేట్​గా ఉండటంతో ముందు వీటికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎడ్యుకేషన్లోనూ 13,086 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ పోస్టులు ఉండటం, ఎక్కువ సంఖ్యలో పోటీ పడేందుకు అవకాశం ఉండటంతో వీటిపై ఆఫీసర్లు దృష్టి సారించారు. 

ఖజానాపై భారం పడకుండా

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మూడు నెలలకోసారి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఉద్యోగులు రిక్రూట్ అయితే వారికి జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ బడ్జెట్​లో ప్రత్యేకంగా నిధులేమి కేటాయించలేదు. దీంతో ఖాజానాపై భారం పడకుండా కొన్ని పోస్టులను రానున్న ఆర్థిక సంవ్సతరంలో భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే నోటిఫికేషన్లు పూర్తిస్థాయిలో ఇవ్వకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక సాధారణంగానే ఒక్కో నోటిఫికేషన్​కు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించినందున టీఎస్​పీఎస్సీ ద్వారా నిర్వహించే ఉద్యోగాల భర్తీకి టైం పడుతోంది.

టెట్ నిర్వహించాకే టీచర్ పోస్టుల భర్తీ

విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ జాబ్ కు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఈ ఎగ్జామ్ ను ఆర్నెల్లకోసారి నిర్వహించాల్సి ఉండగా మన రాష్ట్రంలో ఐదేండ్లుగా నిర్వహించలేదు. రాష్ట్రం వచ్చాక 2016 మే 22న తొలిసారి టెట్ నిర్వహించగా 2017 జులై 23న రెండోసారి టెట్‌‌‌‌ పెట్టారు. ఆ తర్వాత టెట్​ ఆలోచనే మరిచిపోయారు. 2017లో అర్హత సాధించని వాళ్లు 2,28,027 మంది ఉండగా, వీళ్లతోపాటు గత ఐదేండ్లలో మరో లక్షన్నర మందికి పైగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వాళ్లుంటారు. టెట్ నిర్వహించకపోవడంతో వీళ్లంతా ప్రైవేటు స్కూళ్లలో చదువు చెప్పేందుకు కూడా చాన్స్ లేకుండా పోయింది. త్వరలో భర్తీ చేయనున్న టీచర్ పోస్టులకు పోటీపడాలంటే వీరంతా టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి ఉంది. అందువల్ల ముందుగా టెట్ నిర్వహించకుండా టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.   

ప్రతి నోటిఫికేషన్ కు మధ్య గ్యాప్ 

సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై అసెంబ్లీలో చేసిన ప్రకటనలోనూ ఒక్కో నోటిఫికేషన్​కు కొంత టైమ్ తీసుకుంటామన్నారు. దీంతో ఇప్పుడు ఏ పోస్టులకు ముందు నోటిఫికేషన్ ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్​ మొదలు పెట్టేందుకు పోలీసు శాఖలో రిక్రూట్ మెంట్ ఈజీగా ఉంటుందని ఆఫీసర్లు అభిప్రాయపడు తున్నారు. ఆ తరువాత ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్లో లెక్చరర్లు, టీచర్ల పోస్టులతో పాటు గ్రూప్​ నోటిఫి కేషన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ముందు ఎక్కువ మంది అప్లై చేసుకునే పోస్టులకు ప్రియారిటీ ఇవ్వాలని భావిస్తున్నందున లక్షల సంఖ్యలో నిరుద్యోగులు వాటికే పోటీ పడుతారని.. వాటిని కంప్లీట్​ చేసేందుకు టైం పడుతుందంటు న్నరు. ఒకదాని తర్వాత ఇంకోటి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నరు.