V6 News

వెలుగు ఓపెన్ పేజీ: భాషా వివాదాన్ని రగిల్చిన సీబీఎస్ఈ కొత్త సిలబస్

వెలుగు ఓపెన్ పేజీ: భాషా వివాదాన్ని రగిల్చిన సీబీఎస్ఈ కొత్త సిలబస్

2026‌‌‌‌‌‌‌‌–-2027 విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం అమలు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) కొత్త పాఠ్య ప్రణాళికను ఏప్రిల్ 3న విడుదల చేసింది. కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక  ప్రేమ్​వర్క్ సిఫార్సుల ప్రకారం త్రిభాషా  విధానంలోని మూడు భాషల్లో  రెండు భారతదేశానివై ఉండాలి.  బహుభాషా విధానాన్ని దశలవారీగా అమలు చేయడంలో భాగంగా 2026-–2027 విద్యా సంవత్సరం  నుంచి ఆరవ తరగతి నుంచి మూడవ భాషను  సీబీఎస్ఈ తప్పనిసరి చేస్తోంది. 

కేంద్ర హిందీని ఏకైక అధికార భాషగా చేయాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా 1965లో తమిళనాడులో భారీ ఉద్యమం జరిగింది. ఇది హింసాత్మక అల్లర్లకు, సుమారు 70 మంది మరణాలకు దారితీసింది. ఆ నేపథ్యంలో 1968లో భారత  ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖచే  పాఠశాల విద్యాస్థాయిలో విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవాలనే ఉద్ధేశ్యంతో రూపొందించినదే ఈ  ‘త్రి-భాషా సూత్రం’.  ఇది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల  సమావేశం తరువాత 1968 జాతీయ విధాన తీర్మానం ద్వారా అమలులోకి వచ్చింది. ఈ సూత్రం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ  మూడు భాషలను  ఉపయోగించాలి. 

విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపరచాలి

హిందీలో  మాట్లాడే  రాష్ట్రాలలో  హిందీ, ఆంగ్లం, (ప్రాధాన్యంగా దక్షిణ భారతదేశ భాష), హిందీలో  మాట్లాడని రాష్ట్రాలలో హిందీ, ఆంగ్లం, ఏదైనా ప్రాంతీయ భాష ఉండాలని నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్,  కర్నాటక ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాల ప్రజలు చేసిన నిరసనల ఫలితంగా త్రి-భాషా సూత్రాన్ని సవరించి ఈ విధంగా మార్చారు.   తాజాగా సీబీఎస్ఈ చేసిన ప్రకటన తమిళనాడులోని డీఎంకే  ప్రభుత్వానికి, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య  మాటల యుద్ధానికి దారితీసింది. 

జాతీయ విద్యా విధానం, 2020 ఆధారంగా సీబీఎస్ఈ  తీసుకున్న ఈ చర్యను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఎలాంటి  పరస్పర సహకారం లేకుండా, హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని  రహస్యంగా రుద్దే  ఒక మార్గమని పేర్కొన్నారు.   స్టాలిన్  లేవనెత్తిన ఆందోళనలను తోసిపుచ్చుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇస్తూ..  కేంద్ర ప్రభుత్వం భారతదేశవ్యాప్తంగా విద్యార్థులను భారతీయ భాషలను స్వీకరించేలా చురుకుగా ప్రోత్సహిస్తుండగా, తమిళనాడు ప్రభుత్వం మాత్రం విభజన ఓటు బ్యాంకు కోసం తమిళ విద్యార్థులకు విభిన్న అవకాశాలను దూరం చేస్తూనే ఉందని  ఆరోపించారు.  

అయితే,  వివాదం రేకెత్తించిన ఈ భాషా సమస్యను రాజకీయ ప్రయోజనాలు ఆశించి మరింతగా సంక్లిష్టం చేయడం సరికాదు. విద్యార్థుల దీర్ఘకాలిక అభ్యసన సామర్థ్యాలను  మెరుగుపరచడానికి,  జాతి ప్రయోజనాల పరిరక్షణకు భాషా సమస్యను పరిష్కరించేందుకు కృషి  జరగాలి. 

త్రిభాషా సూత్రం చరిత్ర ఏమిటి?

త్రిభాషా సూత్రాన్ని మొదట 1948-–1949లో అమలుపరచాలని  విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సలహా ఇచ్చింది.  మూడు భాషలలో  విద్యను అమలుపరచడానికి భారతదేశం కంటే ముందే నెదర్లాండ్స్ తదితర దేశాల్లో ఈ సూత్రాన్ని అమలుపరిచిన విధానం పరిశీలించాలని సూచించింది.  అలాగే హిందీ భాష మైనారిటీ భాష అని, ఎంతో చరిత్ర, సాహిత్యం ఉన్న ఇతర భాషలపై అంటే కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, మలయాళం, ఉర్దూ, గుజరాతీ  భాషలపై  ఆధిపత్యం లేదని  ఒప్పుకుంటూనే హిందీ భాష చివరికి ఆంగ్లభాష స్థానాన్ని  భర్తీ చేసి  ప్రభుత్వ విధులన్నీ హిందీ భాషలోనే జరగాలని తెలిపారు. 1964-–1965లో  విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో  కొన్ని సవరణలు చేసి త్రి-భాషా సూత్రాన్ని అమలుపరచాలనే సూచనలు వచ్చాయి. అనేక  చర్చలూ, సమావేశాల తరువాత 1968లో భారత పార్లమెంటు అసలైన  త్రి-భాషా సూత్రాన్ని స్వీకరించింది.1968లో  అమలు చేసిన సూత్రాన్ని 1986లో  జాతీయ విద్యా విధానం మళ్ళీ పునరుద్ఘాటించింది.భాషా నిపుణుల సూచనల మేరకు బోధనను నిర్ణయించాలి. 

అయితే ఆచరణలో ఈ త్రిభాషా సూత్రం విద్యారంగంలో విఫలమైంది. ముఖ్యంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం అమలు చేయడం లేదు.  మూడో భాష అయిన ఇతర భారతీయ భాషను వారు పాఠ్యప్రణాళికలో  కచ్చితంగా అమలు చేయకపోవడంతో ఉత్తర భారత విద్యార్థులు రెండు భాషలు మాత్రమే నేర్చుకుంటున్నారు. ఇది వారికి అభ్యసనంలో  సులభంగా మారింది.  అదే సందర్భంలో దక్షిణ రాష్ట్రాల విద్యార్థులు  తప్పనిసరిగా మూడు భాషల అధ్యయనంతో  విద్యార్థులకు  అనవసర భారమౌతోంది.  

జాతీయ విద్యా విధానం ఉపోద్ఘాతంలో మాతృభాష గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావించిన విధానపత్రం, ఆచరణలో అనేక భాషల మధ్య మాతృభాష నిర్లక్ష్యానికి గురయ్యే పరిస్థితిని కల్పించింది. ఈ పరిస్థితులను గమనించి, భాషా నిపుణుల సూచనల మేరకు భాషా బోధనను నిర్ణయించాలి. 

- కె. వేణుగోపాల్
విద్యారంగ విశ్లేషకుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.