
సిద్దిపేట/చేర్యాల, వెలుగు : జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం కింద చేర్యాల ప్రాంతంలో చేపడుతున్న కాల్వల అలైన్‌మెంట్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మార్చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ వ్యాపారులకు..అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో 15 ఏండ్ల క్రితం ఖరారైన దేవాదుల 8 ఆర్ కాల్వకు సంబంధించిన అలైన్మెంట్పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈ కాల్వను 200 మీటర్ల దూరం తవ్వగా , 4 ఆర్ కాల్వకు అలైన్మెంట్ఖరారు చేసి పనులు మాత్రం మొదలుపెట్టలేదు. ఏమైందో ఏమోగాని కారణం చెప్పకుండానే రెండింటికి సంబంధించిన పాత అలైన్మెంట్ ను మార్చి కొత్త అలైన్‌మెంట్‌ను ముందుకు తీసుకువచ్చారు. దీంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం చేర్యాల నుంచి ముస్త్యాల వరకు 11 ఎకరాల భూసేకరణతో కాల్వ పనులు పూర్తయ్యే అవకాశం ఉండగా, కొత్త అలైన్మెంట్ తో 40 మంది రైతులకు సంబంధించిన 22 ఎకరాలు పోతున్నాయి. ఇక ఆకునూరు నుంచి రాంపూర్ కు వెళ్లే 4 ఆర్ కాల్వ అలైన్మెంట్ కూడా మార్చడంతో 80 మంది రైతులు 24 ఎకరాల ను కోల్పోయే పరిస్థితి తలెత్తింది. పాత అలైన్మెంట్తో కేవలం 12 ఎకరాలు మాత్రమే పోయేవి.
రియల్‌వ్యాపారుల భూములు పోతున్నాయనే...
2008లో చేర్యాల టౌన్ నుంచి ముస్త్యాల వరకు 8 ఆర్, ఆకునూరు నుంచి రాంపూర్ వరకు 4 ఆర్ దేవాదుల కాల్వలకు సంబంధించిన అలైన్మెంట్ఖరారు చేశారు. ఆలస్యంగా పనులు ప్రారంభమైనా 8 ఆర్ కాల్వను రెండు వందల మీటర్ల మేర తవ్వి 2018లో ఆపేశారు. ఈ అలైన్మెంట్ల ప్రకారం కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని పనులు నిలిచేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడానికే పాత అలైన్మెంట్ మార్చి కొత్త అలైన్మెంట్ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని తెలుస్తోంది. రైతుల అంగీకారం లేకుండా కొత్త అలైన్మెంట్ఖరారు చేయడమే కాకుండా సర్వే నిర్వహించి భూసేకరణకు రంగం సిద్ధం చేశారు. దీంతో కొత్త అలైన్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ ముస్త్యాల, ఆకునూరు, రాంపూర్ గ్రామాలకు చెందిన దాదాపు వంద మందికి పైగా రైతులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన
దేవాదుల 8 ఆర్, 4 ఆర్ కాల్వల నిర్మాణానికి కొత్త అలైన్మెంట్ప్రకారం భూసేకరణ కోసం ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. పాత అలైన్మెంట్తో కాకుండా కొత్త అలైన్మెంట్ప్రకారం భూములు ఎవరి ప్రయోజనం కోసం సేకరిస్తున్నారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికే పేద రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారు. కొత్త అలైన్‌మెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తహసీల్దార్‌కు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వేరు వేరుగా వినతిపత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.
కొత్త అలైన్మెంట్తో పంటలు మునుగుతయ్
దేవాదుల 8 ఆర్, 4 ఆర్ కాల్వల కొత్త అలైన్మెంట్ప్రకారం పనులు నిర్వహిస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని రైతులంటున్నారు. కొత్త అలైన్మెంట్ప్రతిపాదించిన ప్రాంతం లోతట్టులో ఉంటుందని, ఇక్కడ కాల్వ నిర్మిస్తే భవిష్యత్తులో కాల్వకు రెండు వైపులా నీరు నిలిచిపోతుందని చెబుతున్నారు. దీనివల్ల వందలాది రైతుల పంటలు మునిగిపోతాయంటున్నారు.
రైతులకు అన్యాయం చెయ్యెద్దు
కొత్త అలైన్మెంట్తో అనేక మంది పేద రైతులు నష్టపోతారు. 15 ఏండ్ల కింద ఖరారైన అలైన్‌మెంట్‌ను కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం మార్చడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకొని పాత అలైన్మెంట్ ప్రకారమే దేవాదుల 8 ఆర్ కాల్వ నిర్మించాలి.
– దాసరి అనిల్ కుమార్, రైతు చేర్యాల
కాల్వ పనులు ఆగిపోయిన సంగతి తెలియదు
చేర్యాల నుంచి ముస్త్యాల వరకు 8 ఆర్ , ఆకునూరు నుంచి రాంపూర్ వరకు 4 ఆర్ కాల్వల నిర్మాణం కోసం భూసేకరణ పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం. గతంలో కొత్త అలైన్మెంట్ సర్వే నిర్వహించి దాదాపు 47 ఎకరాల భూ సేకరణ కోసం గ్రామసభ నిర్వహించాం. అప్పుడు రైతులు తమ అభ్యంతరాలను తెలిపారు. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. గతంలో రెండు కాల్వలకు అలైన్మెంట్లు ఖరారై కొంత మేర కాల్వ పనులు కూడా జరిగి నిలిచిపోయాయంటున్నారు. ఆ విషయం నాకు తెలియదు.
– షేక్ ఆరిఫా, తహసీల్దార్, చేర్యాల
ఈ ఫోటోలో ఉన్న రైతు పేరు కొంతం మల్లేశం. చేర్యాల నుంచి ముస్త్యాల వెళ్లే దారిలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దేవాదుల 8 ఆర్ కాల్వ కొత్త అలైన్మెంట్ప్రకారం మల్లేశం మూడెకరాల భూమిని కోల్పోతున్నాడు. అంతేగాక మిగిలిన భూమి మధ్య నుంచే కాల్వ వెళ్తుండడంతో రెండు భాగాలుగా విడిపోతోంది. ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి రూ.60 లక్షలు పలుకుతుండటంతో మిగులు భూమి ముక్కలుగా మారి ఎందుకూ పనికిరాకుండా పోతదని రైతు మల్లేశం ఆవేదన చెందుతున్నాడు. దేవాదుల 8 ఆర్ కాల్వ అలైన్మెంట్ మారడంతో ఈ ప్రాంతంలోని మరో 30 మంది పేద రైతులు సుమారు 20 ఎకరాల వరకు భూములను కోల్పోతున్నారు. రైతుల భూముల నుంచి న్యూ అలైన్మెంట్ 23 ఎకరాలతో పోయే దాన్ని 46 ఎకరాలకు పెంచారు.