దేవదాసీల రాత మార్చింది

దేవదాసీల రాత మార్చింది

మహిళను ఆదిశక్తిగా పూజించే దేశం మనది. ఆడవాళ్లను  ధన, ధాన్యలక్ష్మి అని కొలుస్తారు కూడా. రాకెట్‌‌ సైన్స్‌‌, మెటావర్స్​ వంటి టెక్నాలజీలు వచ్చినా కూడా  కొన్ని ఆచారాలు ఇంకా ఉన్నాయి. వాటిల్లో దేవదాసీ వ్యవస్థ ఒకటి. ఈ ఆచారం పేరుతో ఆడవాళ్లకి వేసిన సంకెళ్లను తెంచాలి అనుకుంది ఈమె. దేవదాసీ లకు కూడా హక్కులు ఉంటాయని, వాళ్లకు మంచి జీవితం ఇవ్వాలని ‘మాస్’​ అనే ఎన్జీవో పెట్టింది  కర్నాటక లోని బెల్​గావికి చెందిన శోభా గస్తీ. ఆ సంస్థ ద్వారా దేవదాసీ లకు కొత్త జీవితాన్ని అందిస్తోంది. అందుకు గాను ఆమెకు ఈ ఏడాది నారీశక్తి అవార్డు వచ్చింది. 

దేవదాసీ అంటే దేవుడి భార్య అని అర్థం. తాము కోరిన కోరికలు తీరితే పుట్టిన ఆడ పిల్లను దేవుని భార్యగా అంకితం ఇస్తామని మొక్కిన మొక్కే ఈ దేవదాసీ ఆచారం. ఈ ఆచారం మొదలైన రోజుల్లో సొసైటీలో దేవదాసీలకు గౌరవం ఉండేది. వాళ్లు గుడిలో సేవ, నాట్యం లాంటివి చేసేవారు. కానీ రాను రాను ఈ ఆచారం వాళ్ల పాలిట శాపంగా మారింది. దేవదాసీ ప్రొహిబిషన్‌‌ యాక్ట్‌‌ ఏనాడో వచ్చినా పూర్తి స్థాయిలో ఆ వ్యవస్థను అరికట్టలేదు.  రెండువేల ఏండ్లుగా ఉన్న ఈ ఆచారం వల్ల అణగారిన వర్గాలకు చెందిన చాలామంది మహిళలు ఎంతో నష్టపోయారు. మన దేశంలోఈ ఆచారం ముసుగులో ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్లు లక్షల్లోనే . వీడీల వంటి ఎన్నోరకాల జబ్బుల బారిన పడడమే కాకుండా, సమాజం దూరం పెట్టడంతో, చేయడానికి ఏ పనీ దొరక్క దీనమైన స్థితిలో ఉన్నారు దేవదాసీలు. దీనికి కారణం వాళ్లకు అండగా నిలిచే వాళ్లు లేకపోవడం, సమస్య పైన అవగాహన లేకపోవడం, చదువుకోకపోవడం. అమాయకత్వం వల్ల నష్ట పోతున్న దేవదాసీ మహిళల్ని కాపాడేందుకు శోభ గస్తి ‘మాస్‌‌’ ( మహిళాభివృద్ధి మట్టు సంరక్షణ సంస్థ)ను 1997లో మొదలు పెట్టింది. దాని ద్వారా చాలామందిని దేవదాసి వ్యవస్థ నుంచి బయటపడేలా చేసింది. 
బెల్​గావిలోని మూడు తాలూకాల్లో ఉన్న 509 ఊర్లలో విమెన్‌‌ ఎంపవర్‌‌‌‌మెంట్‌‌ కోసం చాలా ఏండ్లుగా కృషి చేస్తోంది ‘మాస్​’ ఎన్జీవో. చైల్డ్ మ్యారేజ్​లను అడ్డుకోవడం, ఆడపిల్లల్ని చదివించడం కోసం పనిచేస్తోంది. దేవదాసి రిహాబిలిటేషన్‌‌ సెంటర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసి వాళ్ల బతుకుల్లో వెలుగులు నింపింది. మాస్‌‌ సంస్థ  ద్వారా ఇప్పటి వరకు 3779 మందికి పైగా మహిళల జీవితాల్ని ఒక దారికి తెచ్చింది. మాస్‌‌తో పాటు పని చేస్తున్న ఇంకొన్ని ఆర్గనైజేషన్స్‌‌ సాయంతో ఎంతోమందికి ఉపాధి కలిపిస్తోంది శోభ.  అమ్మాయిలను వ్యభిచారులుగా మార్చడం, చైల్డ్‌‌ మ్యారేజ్‌‌, మహిళలపై జరిగే వేధింపుల మీద కూడా పోరాడుతోంది. వాళ్లకు హెచ్‌‌ఐవి పైన ఉన్న అపోహలు పోగొట్టి ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకునేలా  చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలన్నీ తిరిగి దేవదాసీ వ్యవస్థ, చైల్డ్‌‌ మ్యారేజ్‌‌ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్​ గురించి అవగాహన కల్పిస్తోంది. అందుకుగాను ఈ ఏడాది మహిళా దినోత్సవం నాడు రాష్ట్రపతి చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం తీసుకుంది.