
దేవరకొండ, వెలుగు: సాగర్ బ్యాక్ వాటర్ లో చేపల వేటకు కూలీలుగా వెళ్లిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులను దేవరకొండ పోలీసులు రెస్క్యూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బిహార్, జార్ఖండ్, చతీస్గఢ్ నుంచి వలస కార్మికులను కొందరు కాంట్రాక్టర్లు తీసుకొచ్చి నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ సాగర్ బ్యాక్ వాటర్ లో చేపలు పట్టిస్తున్నారు. పని తగ్గ వేతనం చెల్లించకుండా కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ బెదిరిస్తున్నారు.
తినడానికి తిండి, కూరగాయలు మాత్రమే అందిస్తూ వారిని బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ చేపల వ్యాపారం చేస్తున్నారనే విషయం దేవరకొండ పోలీసులకు తెలిసింది. ఆదివారం 30 మంది వలస కార్మికులకు విముక్తి కల్పించారు. దేవరకొండ టౌన్ లో టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా, రెండు, మూడు రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.