వరంగల్ నగరం ముంపునకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి : శశాంక

వరంగల్ నగరం ముంపునకు శాశ్వత పరిష్కారం చేపట్టాలి : శశాంక

వరంగల్​ సిటీ, వెలుగు: నగరం ముంపునకు గురికాకుండా ప్రణాళిక ప్రకారం శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తోపాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి భద్రకాళీ బండ్, చిన్న వడ్డేపల్లి చెరువు, ఐసీసీసీ కేంద్రాల్లో పర్యటించి వరద ముంపును ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

 భద్రకాళీ చెరువు సమీపంలో ముంపు గురయ్యే ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీల్లో తిరిగారు. 12 మోరీల వద్ద వరద ప్రవాహాన్ని, చిన్న వడ్డేపల్లి చెరువును పరిశీలించారు. కట్ట మల్లన్న చెరువు నుంచి వచ్చే వరద వల్ల చిన్న వడ్డేపల్లి చెరువును ముంపునకు గురయ్యే సమీప ప్రాంతాలు ఎస్ఆర్ నగర్, సాయిగణేశ్​ కాలనీల ప్రజలను సురక్షితంగా పునరావస కేంద్రాలకు తరలించడం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో వరద తీవ్రతను అంచనా వేసేందుకు వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోకు అనుగుణంగా భద్రకాళి బండ్​ నిల్వ సామర్థ్యాన్ని పెంచి వరద ముంపు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

 గ్రీన్ ఏరియాలోకి నీరు చేరకుండా చూడడంతోపాటు లోతట్టు ప్రాంతాలకు వరద ప్రభావితం కాకుండా చూడాలని, వరద సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైన్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. అనంతరం బల్దియా హెడ్​ఆఫీస్​లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఎంహెచ్ వో రాజారెడ్డి, ఇన్​చార్జి ఎస్ఈ, సిటీ ప్లానర్లు, ఎంహెచ్ వోతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.